
జగనన్న వ్యక్తిత్వమే మా ఆస్తి
జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిత్వమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆస్తి అని తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి
పార్టీ అధినేత జన్మదిన వేడుకల్లో భూమన కరుణాకర్‌రెడ్డి
సాక్షి, నెట్‌వర్క్: జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిత్వమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆస్తి అని తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారు. చంద్రబాబుతోపాటు టీడీపీ నేతలంతా ఉద్దేశపూర్వకంగానే జగన్‌పై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో జరిగిన జగన్ జన్మదిన వేడుకల్లో మాట్లాడుతూ.. ‘‘వైఎస్ జగన్ వ్యక్తిత్వం, నాయకత్వమే మా పార్టీ ఆస్తి. మా ఆస్తిని నిర్వీర్యం చేయడానికి టీడీపీ నేతలు దాడి చేస్తూనే ఉన్నారు. జగన్.. జనం గుండెల్లో నుంచి పుట్టుకొచ్చిన నాయకుడు. ఆయన ఔన్నత్యాన్ని చూసి సహించలేక సోనియా, బాబు మిలాఖత్ అయి తప్పుడు కేసులు బనాయించారు.
జగనన్న వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే.. ఆయన ప్రభుత్వ వాహనం ఎక్కగానే కారు డ్రైవర్‌ను సైతం ఏం సుధాకరన్నా బాగున్నావా? అని ఆప్యాయంగా పలకరిస్తారు. ఒళ్లంతా కురుపులు పట్టిన వ్యక్తులనూ తన చేతులతో ఆప్యాయంగా తడిమి అక్కున చేర్చుకున్న గొప్ప మనసు ఆయనది. అధికారంలోకి రావాలంటే వాగ్దానాలు చేయండని ఎంతోమంది చెప్పినా.. తప్పుడు వాగ్దానాలు చేయలేనని, ప్రజలను మోసగించలేనని, అధికారంలోకి రాకపోయినా ఫరవాలేదుగానీ వంచన రాజకీయాలకు పాల్పడనని చెప్పిన నేత జగన్’ అని గుర్తుచేశారు. మరోవైపు జగన్ జన్మదినవేడుకలు రాష్ట్రవ్యాప్తంగా జరిగాయి. పలుచోట్ల రక్తదాన, వైద్య శిబిరాలు నిర్వహించారు. వృద్ధులు, పేదలకు దుప్పట్లు, దుస్తులు, పండ్లు పంపిణీ చేశారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో, అటు లండన్‌లోనూ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి.