
బాబువి ఉత్తర కుమార ప్రగల్భాలు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 90 శాతం పూర్తి చేసిన సాగునీటి ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు ఇప్పుడు ప్రారంభోత్సవాలు చేస్తూ.. అవన్నీ తానే చేసినట్లుగా ఉత్తర కుమారుడి ప్రగల్భాలు
సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 90 శాతం పూర్తి చేసిన సాగునీటి ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు ఇప్పుడు ప్రారంభోత్సవాలు చేస్తూ.. అవన్నీ తానే చేసినట్లుగా ఉత్తర కుమారుడి ప్రగల్భాలు పలుకుతున్నారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల తో మాట్లాడారు. ప్రాజెక్టులు తన కల అని చెప్పుకుంటున్న చంద్రబాబు గతంలో 9 ఏళ్ల పాలనలో ఎందుకు కలలు కనలేదని సూటిగా ప్రశ్నించారు. చివరకు ప్రజలతో ప్రమాణాలు కూడా చేయించుకుంటూ పొగడ్తల భిక్ష అడుక్కునే భిక్షగాడిలా తయారయ్యాడని దుయ్యబట్టారు.
తన కాళ్లకు తానే మొక్కుకుంటున్నారు
‘‘వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అర్ధాంతరంగా మరణించారు కనుకనే ప్రాజెక్టులు నిలిచిపోయాయి. ఇప్పుడు వాటికే ప్రారంభోత్సవాలు చేస్తున్న చంద్రబాబు తన కాళ్లకు తానే మొక్కుకొని ఆశీర్వదించుకోవడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఉత్తర కుమారుడు కౌరవుల కుచ్చిళ్లు కత్తిరించినట్లుగా ప్రాజెక్టుల రిబ్బన్లు కత్తిరిస్తున్న సీఎం తన పేరును ఉత్తర చంద్రబాబు నాయుడుగా మార్చుకోవాలి’’ అని భూమన మండిపడ్డారు.
అంతా కుతంత్రాలు
‘‘వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని భౌతికంగా లేకుండా చేసే కుట్రలు పన్నగలిగిన చరిత్ర చంద్రబాబుదే. జగన్‌ను జైలుకు పంపుతామని చెబుతూ చంద్రబాబు తన సన్నిహితుల వద్ద కుతంత్రాలు చేస్తున్నారు. ఎవరు రౌడీలు? ఎవరు ఫ్యాక్షనిస్టులు? వైఎస్ తండ్రి వైఎస్ రాజారెడ్డిని హత్య చేయించింది మీరు (చంద్రబాబు) కాదా? ’’అని కరుణాకర్‌రెడ్డి నిలదీశారు.
చౌడప్పలను ఉసిగొల్పుతారా?
‘‘బాబు ఎక్కడ ప్రారంభోత్సవానికి వెళ్లినా జగన్‌ను తిట్టించడానికి కవి చౌడప్పలను మించిన బూతులు మాట్లాడేవారిని చంకన పెట్టుకుని వెళుతున్నారు. వారిని సభలకు పిలిపించి మరీ కులాలను రెచ్చగొడుతున్నారు. ‘తోలుబొమ్మ తైతక్కల తిక్కల రెడ్డి’లను ఉసిగొల్పుతుండడం చూస్తుంటే చంద్రబాబుకు జగన్ అంటే ఎంత భయంగా ఉందో అర్థమవుతోంది. అని భూమన మండి పడ్డారు.