
బుధవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూను కలసి ఫిర్యాదు చేసిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి
తన హక్కులకు భంగం కలిగిం చిన కర్నూలు జిల్లా పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని, తన హక్కులకు రక్షణ కల్పించాలని పీఏసీ చైర్మన్, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి విజ్ఞప్తి చేశారు.
పోలీసులపై మానవ హక్కుల కమిషన్‌కు భూమా ఫిర్యాదు
ఒక చిన్న సంఘటనపై నా మీద మూడు కేసులు పెట్టారు
నాపై రౌడ్‌షీట్ కూడా తెరిచి ఇరికించడానికి ప్లాన్ చేశారు
సాక్షి, హైదరాబాద్: తన హక్కులకు భంగం కలిగిం చిన కర్నూలు జిల్లా పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని, తన హక్కులకు రక్షణ కల్పించాలని పీఏసీ చైర్మన్, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఆయన బుధవారం కమిషన్ చైర్మన్ జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూను కలసి ఈ మేరకు ఫిర్యాదును అందజేశారు. గత అక్టోబర్ 31న నంద్యాల మున్సిపాలిటీ సమావేశంలో జరిగిన ఒక చిన్న సంఘటనను ఆసరాగా చేసుకుని తనపై మూడు కేసులు పెట్టడమే కాక, రౌడీ షీటును కూడా తెరిచారని భూమా హెచ్‌ఆర్సీ చైర్మన్ దృష్టికి తెచ్చారు. తన ఇంటి చుట్టూ 200 మంది పోలీసులు మోహరించి తన కదలికలను నియంత్రించేందుకు ప్రయత్నించారని ఆయనకు చెప్పారు. తన న్యాయవాదితో కలసి భూమా మధ్యాహ్నం కమిషన్ చైర్మన్‌ను కలుసుకుని ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును తీసుకున్న చైర్మన్ పరిశీలిస్తానని వారికి హామీ ఇచ్చారు. నాగిరెడ్డి ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ ఒక సంఘటనకు సంబంధించి ఒకే ఎఫ్‌ఐఆర్‌ను రూపొందించాలని సుప్రీంకోర్టు స్పష్టంగా ఇదివరకే ఇచ్చిన తీర్పును కూడా కాదని తనపై మూడు కేసులు పెట్టడమే కాక, పోలీసులు రౌడీషీటును కూడా తెరిచారన్నారు. సంఘటన జరి గింది ఉదయం 11 గంటల ప్రాంతంలోనైనా తనపై కేసు నమోదు చేసింది రాత్రి 8 ఎనిమిది గంటలకని, అప్పటి వరకూ ఎమ్మెల్యేపై ఎలాంటి కేసులు పెట్టి ఇరికించాలా అని పోలీసు అధికారులు చర్చలు జరిపారని ఆయన దుయ్యబట్టారు. తనపై కేసు రిజిస్టర్ కాకముందే తన ఇంటి చుట్టూ 200 మంది పోలీసులు మోహరించడమే కాక, లోనికి కూడా ప్రవేశించారన్నారు. దీన్ని బట్టి వారు పక్కా ప్రణాళికతో తనపై పన్నాగాలు పన్నారనేది స్పష్టమవుతోందన్నారు.
ఎస్పీ అత్యుత్సాహం: ప్రభుత్వ ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటించాలనే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ ఈ వ్యవహారంలో అత్యుత్సాహాన్ని ప్రదర్శించారన్నారు. మున్సిపల్ సమావేశంలో జరిగిన ఓ చిన్న అవాంఛనీయ సంఘటనను సాకుగా చేసుకుని తనతో పాటు 13 మంది కౌన్సిలర్లపై కేసులు పెట్టారన్నారు. నూటికి నూరు శాతం తనపై రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసులు బనాయించారని, ఈ విషయాలన్నీ తాను కమిషన్‌కు నివేదించి తన హక్కులకు భంగం కల్గించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. దీనిపై కమిషన్ సానుకూలంగా స్పందించినట్టు ఆయన పేర్కొన్నారు.