నేరం... కారాగారం | Basic Information To How To Give a Complaint In Police Station | Sakshi
Sakshi News home page

నేరం... కారాగారం

Sep 10 2019 10:33 AM | Updated on Sep 10 2019 10:34 AM

Basic Information To How To Give a Complaint In Police Station - Sakshi

సమాజంలో మన కళ్ల ఎదుటే కొన్ని నేరాలు జరుగుతుంటాయి. వాటి గురించి పోలీసులకు చెప్పేందుకు సామాన్యులు జంకుతుంటారు. ఫిర్యాదు చేసేందుకు కూడా ముందుకురాని సందర్భాలుంటాయి. ఈ నేపథ్యంలో స్టేషన్, కేసు, విచారణ, కోర్టు, కోర్టులో విచారణ, శిక్ష ఖరారు తదితర అంశాలపై అవగాహన కోసం ‘సాక్షి’ ప్రయోజనాత్మక కథనం..

పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాక..
సాధారణంగా ప్రజలు పోలీస్‌ స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకో లేదా తమ వారిని అరెస్ట్‌ చేసినపుడో స్టేషన్‌కు వెళ్తుంటారు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో ఉంటారు. ఏదైనా అన్యాయం జరిగినపుడు స్టేషన్‌కు వెళ్లి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదులో తమకు జరిగిన అన్యాయం గురించి, చేసిన వ్యక్తుల వివరాలు, ఏ సమయంలో, ఎక్కడ సంఘటన జరిగింది.. సంఘటన జరిగినపుడు అక్కడ సాక్షుల వివరాలు పేర్కొనాలి. అనంతరం ఫిర్యాదుదారునికి స్టేషన్‌ సిబ్బంది రసీదు అందజేస్తారు. లేదంటే రసీదును అడిగి ఫిర్యాదుదారే తీసుకోవాలి. ఫిర్యాదును పరిశీలించిన పోలీసు అధికారులు కేసు నమోదు చేస్తారు. ఇలా నమోదు చేసిన కేసుకు నంబర్‌ ఇచ్చి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు.

ఘటనా స్థలం పరిశీలన
ఫస్ట్‌ ఇన్‌ఫర్మేషన్‌ రిపోర్ట్‌(ఎఫ్‌ఐఆర్‌)ను నమోదు చేసుకున్న పోలీసులు ఆ ప్రతులను పోలీస్‌ ఉన్నతాధికారులకు పంపిస్తారు. అనంతరం నేరం జరిగిన స్థలాన్ని పరిశీలించి, చుట్టుపక్కల వారిని, సాక్షులను విచారిస్తారు. వారి నుంచి వాంగ్మూలం నమోదు చేసుకుంటారు. నేర తీవ్రతను బట్టి పరిశీలన చేసే అధికారుల స్థాయి ఉంటుంది. కేసు తీవ్రతను బట్టి ఆస్తులను, వస్తువులను సీజ్‌ చేసే అధికారం పోలీసులకు ఉంటుంది. ఆ ప్రాంతంలోని కాలి ముద్రలు, వేలిముద్రలను క్లూస్‌ టీం సేకరిస్తుంది. హత్య లేదా ప్రమాదంలో ఎవరైనా మృతి చెందితే, మృతదేహాలకు రక్తసంబంధీకుల సమక్షంలో పంచనామా నిర్వహించి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తారు. ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగిస్తారు. మొత్తం విషయాలను కేసు డైరీ, డైలీ డైరీ, స్టేషన్‌ డైరీలో నమోదు చేస్తారు. పలు మార్గాల ద్వారా విచారణ చేపట్టిన అనంతరం నిందితులను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరుస్తారు. తరువాత కోర్టు నిందితులకు రిమాండ్‌ విధిస్తుంది. పలు సందర్భాల్లో సంఘటనా స్థలంలో పోలీస్‌ జాగిలం, క్లూస్‌ టీం పరిశోధనలోని అంశాలను కూడా కేసు డైరీలో నమోదు చేస్తారు. 

కేసు విచారణ 
చార్జిషీట్‌ పరిశీలించిన కోర్టు నేరాలను గుర్తించి విచారణ ప్రారంభిస్తుంది. విచారణ చేసే కేసులకు సంబంధించిన సాక్షులకు పోలీస్‌ స్టేషన్ల నుంచి సమన్లు జారీ చేస్తారు. సమన్లలో తెలిపిన తేదీల్లో సాక్షులు కోర్టులో హాజరై తాము చూసిన, తమకు తెలిసిన విషయాలను చెప్పాలి. చట్ట ప్రకారం నిందితునిపై ఉన్న కేసును రుజువు చేయాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్‌పై ఉంటుంది. అలాగానే నిందితుడు తాను నేరం చేయలేదని నిరూపించుకునేందుకు కోర్టు పూర్తి అవకాశాలను ఇస్తుంది.

చార్జిషీట్‌..
కేసుకు సంబంధించిన పూర్తి దర్యాప్తు జరిగిన తర్వాత పరిధిలోని కోర్టు మేజిస్ట్రేట్‌కు సీఆర్‌పీసీ సెక్షన్‌ 173(2) ప్రకారం పోలీస్‌ రిపోర్టు పంపిస్తారు. సరైన సాక్ష్యాలు ఉన్నపుడు నిందితునిపై అభియోగం దాఖలు చేసి కోర్టుకు పంపించే పోలీస్‌ రిపోర్టునే చార్జిషీట్‌గా వ్యవహరిస్తారు. అందులో నిందితుని వివరాలు చిరునామా, నేర వివరాలు, ఎప్పుడు, ఎక్కడ అరెస్ట్‌ చేశారన్న విషయాలు, పరారీలో ఉన్న నిందితుల వివరాలు, సాక్షుల వివరాలు, వారి స్టేట్‌మెంట్లు, పంచనామా, పోస్టుమార్టం రిపోర్టులు, డాక్యుమెంట్లు, ఆయుధాలు, వాహనాలు తదితర వివరాలను చార్జీషీట్‌లో పొందుపరుస్తారు. సరైన సాక్ష్యాలు లేనపుడు, మరికొన్ని సాక్ష్యాలను సేకరించి పంపించే నివేదికను ఫైనల్‌ రిపోర్టు అంటారు. అయితే సమాచారం ఇచ్చిన వ్యక్తులు కానీ, బాధితులు కానీ పోలీస్‌ దర్యాప్తు సక్రమంగా లేదని కోర్టులో చెప్పుకునే అవకాశం ఉంటుంది. 

నిర్ధారణకు వస్తే.. శిక్ష ఖరారు 
ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత నేరం జరిగినట్లు కోర్టు నిర్ధారణకు వస్తే నిందితునికి శిక్ష గురించి చెప్పుకునే అవకాశం ఇస్తుంది. తదుపరి శిక్షను కోర్టు ఖరారు చేస్తుంది. కేసు నిరూపణ అయితే నిందితునికి కేసు తీవ్రత, స్థాయిని పట్టి జరిమానా, ఆస్తి జప్తు, సాధారణ జైలు శిక్ష, కఠిన కారాగార శిక్ష, జీవిత ఖైదు, మరణశిక్ష విధించే అవకాశం ఉంటుంది. భారతీయ శిక్షాస్మృతిలో మరణశిక్ష విధించే నేరాలు ఎనిమిది ఉన్నాయి. నేరం నిరూపణ కాకపోతే నిందితునిపై ఉన్న కేసును కోర్టు కొట్టివేస్తుంది.

ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక కౌంటర్‌  
పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేశాం. బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని రాత పూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. కౌంటర్‌లో సిబ్బందిని కూడా నియమించాం. ఫిర్యాదు చేసిన అనంతరం రసీదు కూడా పొందవచ్చు. ఎస్పీకి సమస్యను విన్నవించుకోవాలంటే ప్రతి సోమవారం స్టేషన్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ఉంటుంది. 
– సురేష్, పొదిలి ఎస్సై  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement