వేసేవారే... కాజేస్తున్నారు..! | Auto meted Teller Machine | Sakshi
Sakshi News home page

వేసేవారే... కాజేస్తున్నారు..!

Jan 29 2015 4:17 AM | Updated on Sep 2 2017 8:25 PM

వేసేవారే... కాజేస్తున్నారు..!

వేసేవారే... కాజేస్తున్నారు..!

ఏటీఎం....ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. బ్యాంకు లావాదేవీలను సులభతరం చేసి, ఖాతాదారునికి సమయాన్ని ఆదా చేస్తున్న వ్యవస్థ.

 ఏటీఎం....ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. బ్యాంకు లావాదేవీలను సులభతరం చేసి, ఖాతాదారునికి సమయాన్ని ఆదా చేస్తున్న వ్యవస్థ. అయితే ఈ వ్యవస్థ ఇప్పుడు నేరగాళ్ల పాలిట  ఎనీటైమ్ మోసం అన్న రీతిన తయారైంది. నిఘా లోపం, పర్యవేక్షణ లేకపోవడం   వారి పాలిట వరాలుగా మారాయి.  ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని వినియోగిస్తూ      బ్యాంకులు, ఏజెన్సీల కళ్లుగప్పి ఇంటిదొంగలే లక్షల రూపాయలు తస్కరిస్తున్నారు. ఈజీగా లక్షలాది రూపాయలు జేబులోవేసుకోడానికి ఎంతకైనా తెగబడుతున్నారు. ఉత్తరాంధ్రలో ఈ తరహా మోసాలు ఇప్పటికే తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో జరగ్గా,  తాజాగా విజయనగరంలో రూ.75 లక్షలను కాజేశారు.  ఈ మేరకు సీఎంఎస్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఏజెన్సీ ఉద్యోగులు ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.
 
 విజయనగరం అర్బన్: కొన్ని సంవత్సరాల క్రితం  రాజమండ్రిలోని ఒక ఏటీఎంలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డుతో  ఓ అగంతుకుడు స్నేహం చేశాడు. ఏటీఎంలో లోపాలు, లొసుగులన్నీ తెలిసిన ఆ ఆగంతుకుడు ఏటీఎంలో నగదు చోరీ చేసేందుకు పథకం పన్నాడు. ఆ సెక్యూరిటీ గార్డుకు కొంత సొమ్ము రుచి చూపించి నగదు చోరీ చేస్తూ వచ్చాడు. సంబంధిత పర్యవేక్షక అధికారులకు అనుమానం రాకుండా ఉండేందుకు ఎంతైతే నగదు తీశారో లెక్కకట్టే సమయంలోపు అంతే మొత్తంలో జమ చేసేవాడు. ఇలా సాగిపోతూ కొన్నాళ్ల తర్వాత ఏకంగా రూ.కోటి వరకు కన్నం వేశాడు. ఆ విషయం బయటికి రాకుండా ఉండేందుకు ఏకంగా సెక్యూరిటీ గార్డును హతమార్చాడు.  
 
 ఆ మధ్య విశాఖలోని ద్వారకానగర్‌లో గల ఏటీఎంలో నగదు వేసే సిబ్బంది  చేతివాటం ప్రదర్శించారు. సుమారు రూ.50లక్షల వరకు నగదు వేయకుండానే వేసినట్టు నివేదించారు. వారితో పాటు వచ్చిన బ్యాంకు ఉద్యోగి కూడా కుమ్మక్కయాడు.  తీరా నగదు లావాదేవీలు గడిచాక రూ.50లక్షలు తేడా రావడంతో విషయం బయట పడింది. తాజాగా విజయనగరంలోనూ ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది.   సీఎంఎస్ సంస్థ పరిధిలో గల  ఏటీఎంలలో నగదును లోడ్ చేసే కస్టోడియన్లుగా ఎన్.శ్రీనివాసరావు, భాస్కరరావులు పనిచేస్తున్నారు. ఈనెల 22వ తేదీనుంచి 26వ తేదీ వరకు దఫదఫాలుగా  ఏటీఎంలలో లోడ్ చేయాల్సిన నగదును  వేయకుండా  రూ.75లక్షల 75వేలను స్వాహా చేసినట్టు పోలీసులకు ఆ సంస్థ యాజమాన్యం ఫిర్యాదు చేసింది.
 
 ఏటీఎం కేంద్రాల్లో సొమ్ము వేసే బాధ్యత నుంచి బ్యాంకర్లు తప్పించుకుని ‘అవుట్ సోర్సింగ్’ పద్ధతిని అమలు చేసినప్పటి నుంచే పలుమార్లు అక్రమాలు జరిగాయి.  తాజాగా జిల్లాలోని పలు బ్యాంకుల ఏటీఎం కేంద్రాలకు సొమ్ము సరఫరా చేస్తున్న సీఎంఎస్ సంస్థలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు పట్టణంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో సంస్థ ఉన్నతాధికారుల నుంచి ఫిర్యాదు కూడా నమోదైంది. దేశవ్యాప్తంగా  నిర్వహిస్తున్న ఈ సంస్థకు చెందిన జిల్లా కార్యాలయంలో చోటుచేసుకున్న ఆక్రమాల ఆరోపణ వల్ల బ్యాంకింగ్ వ్యవస్థపై ఖాతాదారుల్లో పలు అనుమానాలు నెలకొన్నాయి.
 
 జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ జాతీయ బ్యాంకుల 149 ఏటీఎంలలో 60 శాతం ఏటీఎంలకు ఎస్‌ఎంఎస్ సంస్థ నగదు సరఫరా చేస్తోంది. జిల్లాలో అత్యధికంగా 96 ఏటీఎంలు ఉన్న ఎస్‌బీఐకి చెందిన 51 ఏటీఎంలను అవుట్‌సోర్సింగ్‌కి ఇచ్చి మిగిలినవ మాత్రమే  ఆ సిబ్బంది నిర్వహిస్తోంది. అంటే దాదాపు 55 శాతం ఏటీఎంల నిర్వ హణ నుంచి ఎస్‌బీఐ తప్పుకొంది. అధికంగా సిబ్బంది ఉన్న పెద్ద బ్యాంక్ పరిస్థితే ఇలా ఉంటే  ఏటీఎంలు ఉన్న చిన్నా చితకా బ్యాంకులన్నీ నూరుశాతం అవుట్ సోర్సింగ్‌తోనే ఏటీఎంలను నడిపిస్తున్నాయి. పటిష్టమైన అవుట్ సోర్సింగ్ వ్యవస్థ లేకపోతే దాని ప్రభావం బ్యాంకర్లపై పడే అవకాశం ఉందని బ్యాంక్ ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు.
 
 జిల్లాలోని వివిధ జాతీయ బ్యాంకుల ఏటీఎంలకు నగదు సరఫరా చేసే అవుట్ సోర్సింగ్ సంస్థ సీఎంఎస్‌కు కూడా జాతీయ స్థాయిలో పెద్ద సంస్థగానే గుర్తింపు ఉంది. వాటి కార్పొరేట్, రీజినల్ కార్యాలయాల నుంచి నేరుగా ఇక్కడి సిబ్బందిని మానిటరింగ్  చేస్తుంటారు. లావాదేవీలన్నీ ఆన్‌లైన్‌లో నడిపిస్తూ ఏటీఎంలలో నగదువేయించడం మాత్రం సెక్యూరిటీ వాహనాలతో మాన్యువల్‌గా చేపడతారు.ఏటీఎంలో నగదు వేసిన ఔవుట్ సోర్సింగ్ సిబ్బంది వెంట  సంబంధిత బ్యాంక్ అధికారి లేకపోవడం వల్ల  పలు అక్రమాలు జరిగే  ఆస్కారముందని స్వయంగా బ్యాంక్ సిబ్బందే చెబుతున్నారు. ఒకసారి వేసిన మొత్తం సొమ్ము లెక్క ఆర్థిక సంవత్సరంలో మూడుసార్లు మాత్రమే తెలుస్తుంది. దీంతో ఏటీఎంలకు నగదు సరఫరా చేసే సంస్థల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement