ఆటోడ్రైవర్‌ కుమార్తెకు ఆలిండియా ర్యాంకు

Auto Driver Daughter Get ICWA First Rank in Krishna - Sakshi

ఐసీడబ్ల్యూఏలో సత్తా చాటిన బెజవాడ విద్యార్థులు

లబ్బీపేట (విజయవాడ తూర్పు): ఆటోడ్రైవర్‌ కుమార్తె ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అండ్‌ వర్క్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీడబ్ల్యూఏ)లో ఆలిండియా ర్యాంకు సాధించింది. కోల్‌కతాలోని ఐసీడబ్ల్యూఏ ఛాప్టర్‌ ప్రకటించిన 2018 డిసెంబర్‌లో జరిగిన ఫైనల్‌ పరీక్షా ఫలితాల్లో విజయవాడ కానూరుకు చెందిన ఆటోడ్రైవర్‌ కుమార్తె బొల్లా మనీషా ఆలిండియా స్థాయిలో 11వ ర్యాంకు సాధించింది. శ్రీకాకుళం జిల్లా మరకపేటకు చెందిన గెంబలి సురేంద్ర ఆలిండియా 3వ ర్యాంకు సాధించగా, బొల్లా మనీషా ఆలిండియా 11వ ర్యాంకు, పశ్చిమగోదావరిజిల్లా వడాలికి చెందిన ఎం.ప్రవీణ్‌కుమార్‌ ఆలిండియా 12వ ర్యాంకు సాధించారు. విజయవాడ సూపర్‌విజ్‌ సంస్థలో శిక్షణ పొందిన వారు 3, 11, 12 ర్యాంకులతో సత్తా చాటినట్లు ఆ సంస్థ ప్రిన్సిపాల్‌ సబ్బినేని వెంకటేశ్వరరావు తెలిపారు.

చాలా సంతోషంగా ఉంది
నాన్న ఆటోడ్రైవర్‌. నన్ను ఎలాగైనా ఉన్నత స్థాయిలో చూడాలని రాత్రి, పగలు ఆటో నడిపి రూపాయి రూపాయి కూడబెట్టి సీఏ కోర్సులో చేర్చారు. నాన్న కష్టానికి ఫలితంగా నేను ఈరోజు ఐసీడబ్ల్యూఏలో ఆలిండియా 11వ ర్యాంకు సాధించడం గర్వంగా ఉంది.    – బొల్లా మనీష, కానూరు, విజయవాడ

తల్లిదండ్రుల కష్టానికి ఫలితం
శ్రీకాకుళం జిల్లాలోని కుగ్రామంలో సాధారణ వ్యవసాయ కుటుంబానికి చెందిన నేను నేడు ఆలిండియా ర్యాంకు సాధించడం సంతోషంగా ఉంది. నా తల్లిదండ్రుల కష్టాన్ని చూసి చలించి పోయేవాడిని. కామర్స్‌ ప్రొఫెషనల్‌ కోర్సుకి మంచి భవిష్యత్తు ఉందని తెలిసి శిక్షణ పొందాను. ఆలిండియా 3వ ర్యాంకు సాధించడంతో నా తల్లిదండ్రుల కష్టానికి గొప్ప ప్రతిఫలం అందించినట్లయింది.– సురేంద్ర, ఆలిండియా మూడో ర్యాంక

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top