ఆర్టీసీ.. ఆన్‌లైన్‌ దూకుడు

APSRTC With Online Services - Sakshi

నగదు రహిత లావాదేవీలకు కసరత్తు  

ప్రయాణికులకు ఈ – టికెట్‌

మొబైల్‌ యాప్‌ ద్వారా చార్జీ వసూలు

డిపో మేనేజర్లకు ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు

సాక్షి, కర్నూలు: ఆర్టీసీ (రోడ్డు రవాణా సంస్థ) ఆన్‌లైన్‌ సేవలతో ప్రయాణికులకు మరింత దగ్గరవుతోంది. ఇప్పటికే బస్సు సీట్ల రిజర్వేషన్లు అధిక శాతం ఆన్‌లైన్‌ చేయగా.. తాజాగా మరో అడుగు ముందుకు వేస్తోంది. నగదు, కాగిత రహిత టికెట్ల జారీకి కసరత్తు చేస్తోంది. ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు పొందలేని ప్రయాణికులకు ఇక డబ్బు తీసుకోకుండా, టికెట్లు ఇవ్వకుండా మెసేజ్‌ ద్వారా ప్రయాణానికి శ్రీకారం చుట్టనుంది. వెళ్లాల్సిన ప్రాంతానికి చెల్లించాల్సిన డబ్బును యాప్స్‌ ద్వారా ఆర్టీసీ ఖాతాలోకి బదిలీ చేసిన వెంటనే ప్రయాణికుడి సెల్‌కు మెసేజ్‌ రావడం.. ఆ తర్వాత ప్రయాణించేందుకు అనుమతి ఇవ్వనున్నారు. దీని కోసం ప్రత్యేక ఖాతాలను తెరిచి ప్రయాణికులకు నూతన సేవలను అందించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన అధికారులు మరో రెండు మూడు రోజుల్లో దీనిని అధికారికంగా అమల్లోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

నో కరెన్సీ.. నో పేపర్‌ టికెట్‌...
అటు ప్రయాణికులు, ఇటు కండక్టర్లు సౌలభ్యంగా ఉండేలా ఆర్టీసీ నో కరెన్సీ, నో పేపర్‌ టికెట్‌కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పూర్తి స్థాయిలో దృష్టి సారించి ంది. ప్రయాణికుడి చేతిలో సెల్‌ ఉండి.. అందులో బ్యాంకింగ్‌ సేవల యాప్స్‌ ఉండి.. అందులో డబ్బు ఉంటే చాలు ఈ టికెట్‌ పొందవచ్చు. 

ఏర్పాట్లు ఇలా...
మొబైల్‌ మెసేజ్‌ టికెట్ల జారీ కోసం అర్టీసీ అధికారులతో పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా డిపో మేనేజర్లు పేరుతో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ప్రత్యేక బ్యాంక్‌ ఖాతాను తెరిచారు. 12 డిపో మేనేజర్లకు వారి సౌలభ్యం కోసం ఖాతాలు తెరిచారు. ఈ ఖాతా నంబర్లకు పేటీఎం యాప్‌ సహకారంతో ప్రత్యేకంగా బార్‌కోడ్‌ ఏర్పాటు చేసి అనుసంధానం చేశారు. బార్‌ కోడ్‌ను కండక్టర్‌ మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేస్తున్నారు. వాటి ద్వారా ఈ ప్రక్రియ నిర్వహిస్తారు. 


మొబైల్‌ టికెట్‌ జారీలో సమస్య తెలుసుకుంటున్న ఆర్‌ఎం

చిల్లర సమస్యకు చెక్‌..
బస్సు టికెట్‌ల జారీ సమయంలో చిల్లర సమస్యను ఆర్టీసీ దీర్ఘకాలికంగా ఎదుర్కొంటోంది. ఈ విషయంలో ప్రయాణికులు, కండక్టర్లు మధ్య తరచూ వాగ్వాదం జరుగుతుంటోంది. ఈ – టికెట్‌ విధానం దూర ప్రాంత సర్వీసులతోపాటు గ్రామీణ ప్రాంత రూట్లలోనూ అమల్లోకి వస్తే చిల్లర సమస్య పరిష్కారమైనట్లే.

మొబైల్‌ యాప్‌ ద్వారా టికెట్‌ చార్జీలు వసూలు
మనం వెళ్లే ప్రాంతం బస్సులు నిలిచే ప్లాంట్‌ ఫాం వద్దకు చేరుకొని అక్కడే ఉన్న కండక్టర్‌కు ఫలానా ఊరికి టికెట్‌ ఇవ్వమని చెబితే ప్రయాణికుడి సెల్‌ ఫోన్‌లోని మొబైల్‌ యాప్స్‌ ద్వారా  కండర్టర్‌ సెల్‌లో ఉన్న బార్‌ కోడ్‌పై స్కాన్‌ చేస్తారు. అక్కడ ప్రయాణికుడు వెళ్లాల్సిన ఊరిపేరు ఎంటర్‌ చేయగానే ప్రయాణికుడి బ్యాంకింగ్‌ యాప్‌లో ఉన్న నగదు కట్‌ అవడం, ప్రయాణికుడి సెల్‌కు మెసేజ్‌ వెళ్లడం వెంటనే జరిగిపోతాయి. ఎక్కాల్సిన బస్సు డ్రైవర్‌కు మొసేజ్‌ చూపిస్తే చాలు.. సీటులో కూర్చొని ప్రయాణించే వీలు కల్పించారు. చదవండి: తిరుపతికి మరో మణిహారం 

త్వరలో ఈ టికెటింగ్‌ విధానం..
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మెసేజ్‌ టికెటింగ్‌ విధానం అమల్లోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నాం. ఇప్పటికే జిల్లాలోని 12 డిపో మేనేజర్ల పేరున ప్రత్యేక ఖాతాలు తెరిచాం. పేటీఎం సహకారంతో బార్‌ కోడ్‌లు క్రియేట్‌ చేయించి వాటిని కండక్టర్‌ సెల్‌ ఫోన్లలో ఇన్‌స్టాల్‌ చేయించాం. దీని ద్వారా ప్రయాణికులు పేటీఎం, గూగుల్‌ పే, ఫోన్‌ పే, భీమ్‌ యూపీఐ వంటి బ్యాకింగ్‌ యాప్స్‌తో చార్జీ సొమ్ము బదిలీ చేసి ఈ టికెట్‌ పొంది, వాటి ఆధారంగా ప్రయాణం చేయవచ్చు.  
– టి. వెంకటరామం, ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్, కర్నూలు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top