వాయుసేన వ్యూహాత్మక కేంద్రంగా ఏపీ

AP is a strategic center of air force - Sakshi

తూర్పు తీరంలో నిఘా, రక్షణ అవసరాలకు విజయవాడ, రాజమండ్రి విమానాశ్రయాల్లో యుద్ధవిమానాల మొహరింపు

భారత వాయుసేన నిర్ణయం

సాక్షి, అమరావతి: భారతదేశ తూర్పుతీరంలో ఆంధ్రప్రదేశ్‌ను వ్యూహాత్మక కేంద్రంగా తీర్చిదిద్దాలని భారత వాయుసేన నిర్ణయించింది. విపత్తు నిర్వహణ, నిఘా, రక్షణ అవసరాల కోసం మన రాష్ట్రంలోని విజయవాడ, రాజమండ్రి విమానాశ్రయాల్లో యుద్ధవిమానాల బేస్‌క్యాంప్‌లు ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు వ్యూహాత్మక  ప్రణాళికను భారత వాయుసేన ఉన్నతస్థాయి కమిటీ ఆమోదించింది.

బంగాళాఖాతంలో పటిష్ట నిఘా
ప్రస్తుతం దేశ తూర్పు తీరంలో చెన్నై సమీపంలోని అరక్కోణంలో వైమానిక దళ స్థావరం ఉంది. యుద్ధ విమానాలను అక్కడ మొహరించారు. ఎక్కడైనా విపత్తులు సంభవించినా, రక్షణ అవసరాల కోసం అక్కడి నుంచే యుద్ధ విమానాలను పంపిస్తున్నారు. కాగా తూర్పు తీరంలో బంగ్లాదేశ్, మయన్మార్‌ నుంచి ఉగ్రవాదుల చొరబాట్లను అరికట్టడంతోపాటు బంగాళాఖాతంలో చైనా ఆధిపత్యంపై కన్నేసి ఉంచాల్సిన అవసరాన్ని భారత వాయుసేన గుర్తించింది. అందుకోసం బంగాళాఖాతంలో నిఘా వ్యవస్థను మరింత పటిష్ట పరచాల్సిన అవసరం ఉంది. ఇక ఎక్కువుగా తుఫాన్ల ముప్పు ఎదుర్కొంటున్న తూర్పుతీర ప్రాంతంలో విపత్తుల నిర్వహణ కూడా వాయుసేన ప్రాధాన్య అంశంగా ఉంది. అందుకోసం తూర్పుతీరంలో మరో వైమానిక స్థావరాన్ని ఏర్పాటు చేయాలని భావించింది. అతి పొడవైన తీరప్రాంతం ఉన్న ఏపీని అందుకు అనువైనదిగా ఎంపిక చేసింది. ఇప్పటికే విశాఖలో భారత నావికాదళ వ్యూహాత్మక కేంద్రం ‘ఐఎన్‌ఎస్‌ డేగా’ ఉంది. దాంతో రాజమండ్రి, విజయవాడ విమానాశ్రయాలను తమ వ్యూహాత్మక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని భారత వాయుసేన భావించింది. ఇందుకుగాను యుద్ధవిమానాలు అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యేందుకు వీలుగా విజయవాడ– రాజమండ్రి మధ్య ఉన్న జాతీయ రహదారిని అభివృద్ధి చేయాలని రెండేళ్ల క్రితమే నిర్ణయించింది. ఉత్తర భారత దేశంలో ఆగ్రా–లక్నో జాతీయరహదారిని అదే విధంగా యుద్ధ విమానాలు అత్యవసర ల్యాండింగ్‌కు వీలుగా అభివృద్ధి చేశారు. 

యుద్ధ విమానాల ల్యాండింగ్‌కు అనుకూలంగా జాతీయ రాహదారులు
ఆరులేన్లుగా ఈ జాతీయరహదారిని అభివృద్ధి చేసిన తరువాత యుద్ధ విమానాల ల్యాండింగ్‌కు అనుగుణంగా తీర్చిదిద్దుతారు. ఈమేరకు  ప్రతిపాదనలకు కేంద్ర రక్షణ శాఖ ఇప్పటికే సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. త్వరలో  దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు. అనంతరం విజయవాడ, రాజమండ్రి విమానాశ్రయాల్లో రక్షణ మౌలిక వసతులను అభివృద్ధికి ప్రణాళికను రూపొందించనున్నారు. యుద్ధవిమానాల మొహరింపు,  రోజువారీ విన్యాసాలు, శిక్షణ తదితర అవసరాలకు అనుగుణంగా రక్షణ మౌలిక వసతులను తీర్చిదిద్దుతారు. దాంతో తూర్పుతీరంలో భారత వాయుసేన నిఘా మరింత పటిష్టమవుతుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top