కోవిడ్‌ యుద్ధానికి రెడీ!

AP Govt is preparing additional staff to fight with Covid-19 virus - Sakshi

ఇప్పటివరకు 8 వేల మంది మెడికల్, నర్సింగ్‌ విద్యార్థుల సంసిద్ధత

రెండ్రోజుల్లో ప్రభుత్వ ప్రకటనకు విశేష స్పందన

కొనసాగుతున్న దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ

మరోవైపు ఎంపికైన వారికి ఆన్‌లైన్‌లో శిక్షణ షురూ

292 పీజీ మెడికల్, జూనియర్‌ డాక్టర్లు హాజరు

సాక్షి, అమరావతి : కరోనా అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వోద్యోగులతో కలిసి పనిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు సిబ్బందిని సిద్ధం చేస్తోంది. ఇందుకోసం మెడికల్, నర్సింగ్‌ విద్యార్థులతో పాటు ప్రైవేట్‌ వైద్యులు, రిటైర్డు ఉద్యోగులు మేము సైతం అంటూ పెద్దఎత్తున ముందుకొస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 8 వేల మంది ఇందుకు దరఖాస్తు చేసుకున్నట్లు కోవిడ్‌ రాష్ట్ర కమాండ్‌ కంట్రోలు సెంటర్‌లో ఈ విభాగం పర్యవేక్షిస్తున్న పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ తెలిపారు. ప్రభుత్వం ఈ ప్రకటన జారీచేసిన రెండు రోజుల వ్యవధిలోనే  ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పరిధిలోని రెండు వేల మంది వైద్య విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ కొనసాగుతుందని ఆయన తెలిపారు. మరోవైపు.. ఎంపికైన మెడికల్‌ విద్యార్థులకు క్వారంటైన్‌ కేంద్రాల్లో ప్రాథమిక సేవలందించేలా శిక్షణను ప్రారంభించింది. ఇందులో భాగంగా..

► 292 మంది పీజీ మెడికల్‌ విద్యార్థులు, జూనియర్‌ డాక్టర్లకు శుక్రవారం ప్రభుత్వం ఆన్‌లైన్‌లోనే శిక్షణ నిర్వహించింది. రోజూ కొంతమందికి చొప్పున ఇది కొనసాగనుంది.
► దరఖాస్తు చేసుకున్న వారి నుంచి ఆసక్తి ధృవీకరణ పత్రం తీసుకున్న అనంతరమే ఆయా రంగాల వైద్య నిపుణుల ఆధ్వర్యంలో శిక్షణ ఉంటుంది. 
► శిక్షణనిచ్చే ముందు నిపుణులు కొన్ని ప్రశ్నల ద్వారా అభ్యర్థుల సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. అనంతరమే ఎంపిక చేస్తారు. మానసిక సంసిద్ధతను కూడా పరిశీలిస్తారు.  
► నర్సింగ్‌ విద్యార్థులకు ఆ రంగానికి సంబంధించిన నిపుణులతో శిక్షణ ఇస్తారు.
► యునిసెఫ్‌–కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ–ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నిపుణులతో కలిసి దరఖాస్తులు, ఎంపిక ప్రక్రియ  కొనసాగుతోందన్నారు. 
► రాష్ట్రంలో అదనపు వైద్య సిబ్బంది అవసరమైన పక్షంలో.. వీరి సేవలను ప్రభుత్వం వినియోగించుకుంటుంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top