చదువు, ఆరోగ్యంపై చిన్నచూపు! | ap govt neglecting education system and peoples health | Sakshi
Sakshi News home page

చదువు, ఆరోగ్యంపై చిన్నచూపు!

Dec 15 2017 4:21 AM | Updated on Jul 11 2019 5:12 PM

ap govt neglecting education system and peoples health - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర పురోగతికి కొలమానమైన మానవాభివృద్ధి సూచికలకు విద్య, వైద్య రంగాలు ఎంతో కీలకం. ఇందులో మెరుగైన ఫలితాలు సాధించడం ద్వారానే ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందుతుంది. సాధారణంగా ఏ ప్రభుత్వమైనా విద్య, వైద్య రంగాలపై చేసే ఖర్చును ఏటా పెంచుకుంటాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇందుకు భిన్నంగా వ్యయం తగ్గిస్తూ పోతోంది. విద్య, వైద్య రంగాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నీతి అయోగ్‌ డాక్యుమెంట్‌ పేర్కొంది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 2015–16లో రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చిన నిధులు, అంతకుముందు 2014–15లో ఇచ్చిన నిధులతోపాటు విద్య, వైద్యంపై రాష్ట్రాలు చేస్తున్న వ్యయం వివరాలతో నీతి అయోగ్‌ ఈ డాక్యుమెంట్‌ రూపొందించింది. 

సామాజిక రంగంపై వ్యయాన్ని తగ్గించిన ఏపీ
సాధారణ విద్య, సాంకేతిక విద్య, యువజన సేవలు, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, మంచినీటి సరఫరా, పారిశుధ్యం, గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, కార్మిక సంక్షేమం, ఉపాధి, సామాజిక భద్రత, పౌష్టికాహారం లాంటి వాటిని సామాజిక రంగాలుగా పరిగణించి రాష్ట్రాలు చేస్తున్న వ్యయాన్ని లెక్కించారు. సామాజిక రంగంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2014–15తో పోల్చి చూస్తే 2015–16లో బాగా తక్కువగా వ్యయం చేసిందని నీతి అయోగ్‌ తెలిపింది. మిగతా రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్‌ ఈ రంగాలపై వ్యయంలో బాగా వెనుకబడిపోయిందని వెల్లడించింది. 

నీతి అయోగ్‌ ఏం చెప్పిందంటే.....
- 2014–15 రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో సామాజిక రంగంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వ్యయం 8.40% కాగా 2015–16లో 7.51% మాత్రమే ఉంది. అంటే 0.89% తగ్గినట్లు నీతి అయోగ్‌ పేర్కొంది. 
2014–15లో మొత్తం రాష్ట్ర ప్రభుత్వ వ్యయంలో సామాజిక రంగంపై 38.90% ఖర్చు చేయగా, 2015–16లో 31.06% మాత్రమే వెచ్చించింది. అంటే 7.84% తగ్గింది.
సామాజిక రంగంపై తమిళనాడు కూడా తక్కువగానే (0.49%) వ్యయం చేయగా మిగతా రాష్ట్రాలు మాత్రం అధికంగానే ఖర్చు పెట్టాయి.
రాష్ట్ర మొత్తం వ్యయంలో సామాజిక రంగంపై గోవా (1.76%), రాజస్థాన్‌ (1.26%), పశ్చిమబెంగాల్‌ (0.99%) తక్కువగా వ్యయం చేయగా ఆంధ్రప్రదేశ్‌  మాత్రం ఏకంగా 7.84% తక్కువగా వ్యయం చేసింది.
విద్య, వైద్య రంగాలపై వ్యయం విడివిడిగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌ తిరోగమనంలో ఉంది.
2014–15 రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వైద్య రంగంపై ఆంధ్రప్రదేశ్‌ వాస్తవంగా చేసిన వ్యయం 1.04% మాత్రమే. 2015–16లో 0.80% మాత్రమే వ్యయం చేసింది. అంటే 0.24% తగ్గిపోయింది.
2014–15 రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో విద్యా రంగంపై ఆంధ్రప్రదేశ్‌ వాస్తవంగా చేసిన వ్యయం 3.16 మాత్రమే కాగా 2015–16లో 2.77 శాతమే ఖర్చు పెట్టింది. 
-14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 2015–16లో ఏపీకి కేంద్రం నుంచి నిధులు పెరిగినప్పటికీ సామాజిక రంగంపై వ్యయం తగ్గడాన్ని నీతి అయోగ్‌ ప్రస్తావించింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల నేపథ్యంలో అంతకు ముందు కన్నా రాష్ట్రానికి కేంద్ర నిధులు రూ.6,125.25 కోట్లు అదనంగా వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement