
సాక్షి, విజయవాడ : కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా గుజరాత్‌లో చిక్కుకుపోయిన ఆంధ్రా మత్స్యకారులు మంగళవారం సాయంత్రం సొంత రాష్ట్రానికి బయలు దేరారు. పది బస్సుల్లో దాదాపు 780మంది మత్స్యకారులు ఏపీకి పయనమయ్యారు. ఈ నెల 30వ తేదీన వారు సొంతగడ్డపై అడుగుపెట్టనున్నారు. ఏపీ ప్రభుత్వం మత్స్యకారుల తరలింపుకోసం మూడు కోట్ల రూపాయలను కేటాయించింది. వారిని రాష్ట్రానికి తరలించడానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. స్థానిక అధికారులు జాలర్లందరికీ ఆరోగ్య పరీక్షలు చేసి పాస్‌లు ఇవ్వగా మొదటి విడతగా 780 మంది శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారిని తరలిస్తోంది. కాగా, లాక్‌డౌన్ కారణంగా గుజరాత్‌లో మొత్తం 5వేల మంది మత్స్యకారులు చిక్కుకున్నారు. అధికారులు విడతల వారీగా వారిని ఏపీకి తీసుకువస్తున్నారు.