కట్నపాము

Anty Dowry Day Specual Story - Sakshi

పెరుగుతున్న బాధితులు అంతం కాని దురాచారం

కౌన్సెలింగ్‌తో కొంత పరిష్కారం

నేడు వరకట్న వ్యతిరేక దినోత్సవం

పెదవేగి మండలానికి చెందిన సునీత(పేరుమార్చాం)కు తొమ్మిదేళ్లక్రితం పెళ్లయింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లయినప్పటి నుంచి భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు. రెండేళ్ల క్రితం వేధింపులు తారాస్థాయికి చేరడంతో భార్యాభర్తలు విడిపోయారు. బాధితురాలు సోమవరప్పాడు చల్లపల్లి చారిటబుల్‌ ట్రస్టు సభ్యులను ఆశ్రయించింది. వారు బాధితురాలి భర్త, అతని కుటుంబ సభ్యులకు పలుమార్లు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఇప్పుడు సునీత భర్త, బిడ్డలతో ఆనందంగా జీవిస్తోంది.

పశ్చిమగోదావరి, దెందులూరు: వరకట్నం.. సమాజాన్ని పట్టిపీడిస్తున్న దురాచారం. ఇది నానాటికీ పెరుగుతోంది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్నా.. కట్నం లేనిదే పెళ్లి జరగని దుస్థితిలో ఇంకా యువతులు ఉన్నారు. జిల్లాలో వరకట్న వేధింపులకు ఎందరో అబలలు బలైపోతున్నారు. ఈ కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. నియంత్రణకు చట్టాలున్నా.. సరిగా అమలు కావడం లేదు.. ఫలితంగామానవ సంబంధాలు పూర్తిగా ఆర్థిక సంబంధాలుగామారుతున్నాయి.

మార్పు ఎక్కడ రావాలి!
పిల్లల పెళ్లిళ్ల విషయంలో తల్లిదండ్రుల్లో మార్పు రానిదే వరకట్న దురాచారం అంతం కాదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆడపిల్లల తల్లిదండ్రులు కూతరు సుఖంగా ఉండాలంటే అల్లుడు లేదా అతని కుటుంబానికి ఎంతో కొంత ముట్టజెప్పాలనే ఆలోచనలో ఉన్నారు. అల్లుడు డాక్టరో, ఇంజినీరో అయితే పిల్ల సుఖపడుతుందని ఆశపడి అప్పులు చేసి కూడా కట్నాలు సమర్పించి పెళ్లిళ్లు చేస్తున్నారు. మగపిల్లల తల్లిదండ్రులూ కట్నం తీసుకోవడం సామాజిక గౌరవంగా భావిస్తున్నారు. ఎంత కట్నం వస్తే అంత గొప్ప అన్నట్టు వ్యవహరిస్తున్నారు. కట్నం అడగకపోతే అబ్బాయిలో ఏం లోపం ఉందో అనే అనుమానాలు వస్తున్నాయని మగపిల్లల తల్లిదండ్రులు భావిస్తున్నారు. 

అత్యాశాపరుల వల్లే సమస్య!
పిల్లలకు పెళ్లి సమయంలో లాంఛనాలు ఇవ్వడం ఆనవాయితీ. ఏదో స్తోమత కొద్ది ఇరువర్గాల అంగీకారంతో పెళ్లి జరిగితే ఇబ్బందేం లేదు. కానీ ఇదే ఆసరాగా తీసుకుని కొందరు అత్యాశకు పోతున్నారు. ఆడపిల్లల తల్లిదండ్రుల స్తోమతతో పనిలేకుండా కట్నాలు డిమాండ్‌ చేస్తున్నారు. కొందరు పెళ్లి సమయంలో ఇచ్చిన కట్నం కాకుండా పెళ్లయిన తర్వాత కూడా వధువును వేధిస్తున్నారు. దీనివల్ల ఎందరో వివాహితలు బలైపోతున్నారు. పెళ్లయి ఏళ్లు గడిచినా కట్నం కోసం వేధించే ప్రబుద్ధులున్నారు. పెళ్లయిన తర్వాత భర్త, అత్త, ఆడపడుచులు పెట్టే చిత్రహింసలు తట్టుకోలేక ఎందరో మహిళలు పోలీస్టేషన్‌ బాట పడుతున్నారు. అయినా మన చట్టాలు ఏమీ చేయలేకపోతున్నాయి. వారికి జరుగుతున్న న్యాయం అంతంతే..! ఎన్నో కాపురాలు కట్నం దాహానికి కూలిపోతున్నాయి. ఎందరో మహిళలు బలవన్మరణానికి పాల్పడుతున్న ఘటనలూ ఉన్నాయి.  

కౌన్సెలింగ్‌తో పరిష్కారం
అదనపు కట్నం కేసుల్లో ఆత్మహత్యలు పరిష్కారం కాదు. భార్యాభర్తలు ఇద్దరినీ కౌన్సెలింగ్‌ చేస్తున్నాం. వివాదాలు పరిష్కరించి రాజీ చేసి అన్యోన్యంగా జీవించడానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా గ్రామాల్లో కౌన్సెలింగ్‌ సెంటర్లు ఏర్పాటయ్యాయి. ప్రతి నెలా ఏలూరు ప్రభుత్వ వైద్యశాలలో సఖీ వన్‌స్టాప్‌ సెంటర్‌లో భార్యాభర్తలకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం.– కె.శైలజ, జిల్లా సీనియర్‌ సివిల్‌ జడ్జి

చట్టాల అమలుకు కృషి
వరకట్నం కోసం మహిళలను వేధించే భర్తలు, కుటుంబ సభ్యులపై చట్టరీత్యా చర్యలు తప్పవు. ఫిర్యాదు అనంతరం విచారణ చేసి కేసులు నమోదు చేస్తున్నాం. కొన్ని ఫిర్యాదుల్లో స్టేషన్‌ పరిధిలో భార్యాభర్తలకు కౌన్సెలింగ్‌ ఇచ్చి మా వంతు పరిష్కార చర్యలు చేపడుతున్నాం.ఎం.రవిప్రకాష్, జిల్లా ఎస్పీ 

ఆలోచనా విధానం మారాలి
కుమారుడిని పెళ్లిచేసుకుని ఇంటికి వచ్చిన కోడలిని తోటి మహిళగా గౌరవించి ఆదరించాలి. తమ సొంత బిడ్డలా చూసుకోవాలి. భర్త చిన్న చిన్న సమస్యలు పెద్దవి చేయకుండా ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. ఈ విధానం అవలంబిస్తే కుటుంబ కలహాలు ఉండవు.శ్యామలాదేవి, ఫిజికల్‌ డైరెక్టర్‌ , పెరవలి ఉన్నత పాఠశాల

మార్పు రావాలి
పెళ్లి అనగానే మెట్టినింటి వారికి గుర్తుకు వచ్చేది కట్నం. ఈ విధానంపై సమాజంలోని ప్రతి ఒక్కరి ఆలోచన మారాలి. మేధావులు, స్వచ్ఛంద సంస్థలు, ఉపాధ్యాయులు వరకట్న దురాచారం నిర్మూలనకు
కృషి చేయాలి. విస్తృతంగా ప్రచారం చేయాలి. అవగాహన సదస్సులు నిర్వహించాలి. వరకట్నం తీసుకుంటే పడే శిక్షలపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలి.– సీహెచ్‌ గిరిజాదేవి, చైర్‌పర్సన్, చల్లపల్లి ట్రస్ట్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top