ఒంగోలు జెడ్పీ చైర్మన్ వ్యవహారంలో మరో పీటముడి | another twist in prakasam ZP chairman | Sakshi
Sakshi News home page

ఒంగోలు జెడ్పీ చైర్మన్ వ్యవహారంలో మరో పీటముడి

Jan 10 2015 8:59 AM | Updated on Sep 2 2018 5:20 PM

ఒగోలు జెడ్పీ చైర్మన్ వ్యవహారంలో ఉత్కంఠ వీడిందన్న ఆనందం తీరకముందే మరో పీటముడి పడింది. తాజాగా సుప్రీంకోర్టు జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులు మరోమారు అధికారులను చిక్కుల్లోకి నెట్టేసింది.

ఒంగోలు:  జెడ్పీ చైర్మన్ వ్యవహారంలో ఉత్కంఠ వీడిందన్న ఆనందం తీరకముందే మరో పీటముడి పడింది. తాజాగా సుప్రీంకోర్టు జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులు మరోమారు అధికారులను చిక్కుల్లోకి నెట్టేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై ఈదర హరిబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఆయనకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు వెలువడ్డాయి. జిల్లాలో మొత్తం 56 జెడ్పీటీసీ స్థానాలుండగా వాటిలో 31 స్థానాలను వైఎస్సార్‌సీపీ, 25 స్థానాలను టీడీపీ దక్కించుకున్నాయి. టీడీపీకి మెజార్టీ లేకపోయినప్పటికీ అధికారబలంతో వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచిన ముగ్గురు సభ్యులను మభ్య పెట్టి అటువైపు తిప్పుకోవడంతో జెడ్పీ పీఠం కైవసంలో పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
 
విప్ ధిక్కరించారంటూ టీడీపీ ఫిర్యాదు..
తాము జారీచేసిన విప్ పత్రం అందుకొని కూడా తమ పార్టీ బలపరిచిన అభ్యర్థికి కాకుండా ఉపాధ్యక్ష ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా వైస్ చైర్మన్ బరిలో నిలిచిన నూకసాని బాలాజీకి ఓటు వేశారని, అతనిని జెడ్పీటీసీ అభ్యర్థిగా అనర్హుడిగా ప్రకటించాలంటూ టీడీపీ తరుపున విప్ అధికారం పొందిన నరసింహం జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడం, దానిపై ఈదర అభ్యర్థిత్వం చెల్లదంటూ ఎన్నికల అధికారైన జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
 
దీంతో జెడ్పీటీసీకి అనర్హుడిగా ఈదర హరిబాబును ప్రకటించడంతో జెడ్పీ చైర్మన్ పదవిని కూడా ఆయన కోల్పోవాల్సి వచ్చింది. దీనిపై ఈదర హరిబాబు తొలుత హైకోర్టును ఆశ్రయించగా జిల్లా కోర్టులో కేసు దాఖలు చేయాలని ఆదేశించింది. దీంతో జిల్లా కోర్టులో కేసు దాఖలు చేయగా జిల్లా కలెక్టర్ ఉత్తర్వులను సమర్థిస్తూ అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో ఈదర హరిబాబు హైకోర్టు సింగిల్ జడ్జిని ఆశ్రయించారు. తనకు విప్ జారీచేయడమే సక్రమంగా జరగలేదని పేర్కొన్నారు.
 
చివరకు అధికారులు జెడ్పీ కార్యాలయానికి రాకుండానే జెడ్పీ చైర్మన్ ఛాంబర్‌కు తాళాలు వేశారు.  తనను అధికారులు అవమానించారంటూ కొన్ని రోజులపాటు ఈదర జెడ్పీ మెట్లపైనే కూర్చొని నిరసన కూడా వ్యక్తం చేశారు. హైకోర్టు డివిజన్ బెంచ్ తాత్కాలికంగా వైస్ చైర్మన్ అయిన నూకసాని బాలాజీ చైర్మన్‌గా కొనసాగుతారని, మూడు నెలల్లోగా జిల్లా కోర్టులో కేసు పరిష్కారం చేయాలంటూ హైకోర్టు డివిజన్ బెంచ్ పేర్కొంది.
 
తాజా వ్యవహారంతో మళ్లీ మొదటికి..
హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశంతో జెడ్పీ అధికారులు, జిల్లా అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. జెడ్పీ చైర్మన్‌గా నూకసాని బాలాజీ బాధ్యతలు చేపట్టడంతోపాటు ఈనెల 1న జెడ్పీ చైర్మన్ బంగ్లాలోకి అధికారికంగా మారి 8న సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అయితే ఈదర హరిబాబు మాత్రం హైకోర్టు డివిజన్ బెంచ్ జారీచేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించగా శుక్రవారం ఆయన పిటీషన్‌ను సుప్రీంకోర్టు స్వీకరించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ జారీచేసిన ఉత్తర్వులపై మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి.
 
దాంతోపాటు ఈ కేసుకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. దీంతో జెడ్పీటీసీగా కొనసాగే అవకాశం ఈదర హరిబాబుకు లభించినట్లయింది. జెడ్పీ చైర్మన్‌గా కూడా ఆయనకే అవకాశం ఉంటుందా లేదా అనే విషయంపై పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement