
సాక్షి, అమరావతి : సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అఖండ విజయం సాధించిన నేపథ్యంలో ఈ నెల(జూన్) 12న నుంచి నూతన శాసనసభ తొలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. జూన్ 12న కొత్త సభ్యులతో ప్రమాణ స్వీకారం, 13న స్పీకర్ ఎన్నిక, 14న అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొలి సారి అసెంబ్లీ హాజరుకాగా, ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు నాయుడు ఈ సమావేశాలకు హాజరు కానున్నారు.
కాగా సమావేశాలు ప్రారంభానికి ముందే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన మంత్రివర్గాన్ని విస్తరించబోతున్నారు.ఇప్పటికే ఆయన ఈ నెల 8వ తేదీ ఉదయం తొలుత సచివాలయంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అదే రోజున మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం సచివాలయంలో జరుగుతుంది. మంత్రివర్గ విస్తరణకు ఒక రోజు ముందుగా 7వ తేదీన వైఎస్సార్ ఎల్పీ సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రివర్గ కూర్పు ఎలా ఉండబోతోందో వివరిస్తూ ఆ మరుసటి రోజున జరిగే విస్తరణపై ఎమ్మెల్యేలను మానసికంగా జగన్ సిద్ధం చేస్తారని పార్టీ వర్గాల సమాచారంగా ఉంది.