అవినీతిని సహించేది లేదు..!

Anantapur Collector Satyanarayana Warns Revenue Employees - Sakshi

రెవెన్యూ ఉద్యోగులకు కలెక్టర్‌ సత్యనారాయణ హెచ్చరిక 

అవినీతిరహిత పాలనే లక్ష్యంగా పనిచేయాలి

సాక్షి, అనంతపురం అర్బన్‌: రెవెన్యూ సేవల్లో అవినీతికి తావిస్తే సహించేది లేదంటూ ఉద్యోగులను కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ హెచ్చరించారు. ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి భూ సేకరణ, ఇతర అంశాలపై అనంతపురం రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని తహసీల్దార్లు, ఆర్‌ఐలు, వీఆర్‌ఓలు, సర్వేయర్లతో గురువారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో ఆయన సమీక్షించారు. నూతన ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల అమలును సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఉన్నతాధికారులకు సమర్పించే నివేదికల్లో సమగ్ర సమాచారం ఉండలన్నారు. తప్పుడు నివేదిక సమర్పిస్తే ఏస్థాయి అధికారిపైన అయినా కఠిన చర్యలు తప్పవన్నారు. అవినీతిరహిత పాలన అందించే  లక్ష్యంగా ప్రతి ఒక్కరూ విధులు నిర్వర్తించాలని ఆదేశించారు.
   
ఇళ్ల పట్టాల పంపిణీకి చర్యలు 
ఫిర్యాదులు అధికంగా పింఛన్లు, ఇళ్ల పట్టాలు, రేషన్‌కార్డు మంజూరుతో పాటు ఆర్థికేతర సమస్యలు వస్తున్నాయి. ప్రతి నిరుపేదకూ ఇంటిని నిర్మించి ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీ ప్రక్రియ వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పౌర సేవల్లో అవినీతికి తావివ్వకూడదన్నారు. ముఖ్యంగా రెవెన్యూ సిబ్బంది ద్వారా అవినీతి జరిగినట్లు నిర్ధారణ అయితే సస్పెండ్‌ చేస్తానని హెచ్చరించారు. రెవెన్యూ రికార్డులు సక్రమంగా లేకపతే సంబంధిత తహసీల్దారుపై చర్యలు ఉంటాయన్నారు. భూ లభ్యతకు సంబంధించి 22–ఎ మేరకు వివరాల జాబితాను సక్రమంగా సిద్ధం చేసుకోవాలన్నారు.

భూమి వివరాలను, స్పందన ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు సక్రమంగా నమోదు చేయాలన్నారు. భూ సమస్యలను సర్వేయర్లు, వీఆర్‌ఓలు సమన్వయ సహకారం అందించుకుంటూ పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం పలు మండలాల్లో ఇప్పటి వరకు జరిగిన ప్రభుత్వ భూములు గుర్తింపు గురించి సంబంధిత తహసీల్దార్లను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి జేసీ హెచ్‌.సుబ్బరాజు, డీఆర్‌ఓ ఎం.వి.సుబ్బారెడ్డి, ఆర్‌డీఓ ఆర్‌.కూర్మనాథ్, సర్వే భూ రికార్డుల శాఖ ఏడీ మచ్ఛీంద్రనాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.  

భూనిర్వాసితులకు వెంటనే న్యాయం చేయండి 
పెనుకొండ: భూనిర్వాసితులకు కియా కార్ల పరిశ్రమలో వెంటనే ఉద్యోగావకాశాలు కల్పించి తగిన న్యాయం చేయాలని అధికారులను కలెక్టర్‌ సత్యనారాయణ ఆదేశించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఆయన అధికారులతో సమావేశమై మాట్లాడారు. కియా కార్ల పరిశ్రమ ఏర్పాటులో భూములు కోల్పోయిన రైతుల కుటుంబాల్లోని పిల్లలకు ఇంతవరకూ ఉద్యోగాలు ఇవ్వకపోవడం కేవలం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అధికార యంత్రాంగం నిర్లక్ష్యమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కియా కార్ల పరిశ్రమకు అవసరమైన ఆర్‌ఓబి (ఓవర్‌బ్రిడ్జి) నిర్మాణానికి అవసరమైన భూసేకరణ చేపట్టాలన్నారు. నైపుణ్యమున్న వారిని కియాకు పంపితే వెంటనే ఉద్యోగాలు కల్పిస్తామంటూ ఈ సందర్భంగా కలెక్టర్‌కు కియా లీగల్‌ హెడ్‌ జూడ్‌ తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీఓ శ్రీనివాస్, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ గోపీకృష్ణ,  అహుడా వీసీ మురళీకృష్ణగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. ఇదిలాఉండగా పెనుకొండ సమీపంలోని కియా కార్ల పరిశ్రమలో ఈనెల 31న కార్‌మాస్‌ ప్రొడెక్షన్‌ సెంటర్‌ ప్రారంభోత్సవం నిర్వహించనున్నట్లు కియా ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆహ్వానించినట్లు తెలిసింది. 

రూ.1.10 కోట్లతో ఆర్థో ఓటీ  
అనంతపురం న్యూసిటీ: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో రూ.1.10 కోట్లతో ఏర్పాటు చేసిన అధునాత ఆపరేషన్‌ థియేటర్లను కలెక్టర్‌ సత్యనారాయణ గురువారం ప్రారంభించారు. ఆస్పత్రిలో అధునాతన పద్ధతుల్లో ఎముకల శస్త్రచికిత్స విభాగాలు(మాడ్యులర్,నాన్‌ మాడ్యులర్‌) ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు.  కీళ్లు, మోకాళ్ల మార్పిడితో పాటు కుంటి కాళ్లను సరిచేయడం జరుగుతుందన్నారు.  ప్రజలకు నమ్మకం కల్గించేలా వైద్య సేవలందించాలని వైద్యులకు సూచించారు. కలెక్టర్‌ వెంట సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బాబూలాల్, డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్‌ రామస్వామి నాయక్, డాక్టర్‌ నవీన్‌కుమార్, ఆర్‌ఎంఓ డాక్టర్‌ లలిత, ఏఓ డాక్టర్‌ శౌరి, ఆర్థో హెచ్‌ఓడీ డాక్టర్‌ ఆత్మారాం, మేనేజర్‌ శ్వేత ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top