అనకాపల్లిలో దొంగలు మరోసారి పేట్రేగిపోయారు. ఒక్కరోజు వ్యవధిలో అయిదిళ్లల్లో చోరీ చేసి పోలీసులకు సవాల్ విసిరారు. మంగళవారం రాత్రి జరిగిన చోరీలను మరిచిపోకముందే బుధవారం రాత్రి గొల్లవీధిలోని గీతాంజలి గెలాక్సీ అపార్టుమెంట్‌లో భారీ చోరీ జరిగింది
అనకాపల్లి అర్బన్, న్యూస్‌లైన్: అనకాపల్లిలో దొంగలు మరోసారి పేట్రేగిపోయారు. ఒక్కరోజు వ్యవధిలో అయిదిళ్లల్లో చోరీ చేసి పోలీసులకు సవాల్ విసిరారు. మంగళవారం రాత్రి జరిగిన చోరీలను మరిచిపోకముందే బుధవారం రాత్రి గొల్లవీధిలోని గీతాంజలి గెలాక్సీ అపార్టుమెంట్‌లో భారీ చోరీ జరిగింది. గ్రౌండ్‌ఫ్లోర్‌లో నివసిస్తున్న పాలూరి నాగేశ్వరరావు ఇంట్లో దొంగలు చొరబడి 14 తులాల బంగారు నగలు, 30 కిలోల వెండి ఆభరణాలు, రూ.లక్షా 10 వేల నగదు అపహరించుకుపోయారు.
సమీపంలోని చినరాజుపేటకు చెందిన చింతపల్లి సంతోష్ ఇంట్లో రూ.3 వేలు, 3 తులాల వెండి ఆభరణాలు చోరీ చేసినట్టు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నక్కా గురుమూర్తి, సలీం, కిలాడ అప్పలరాజు ఇళ్లల్లోనూ చోరీలు జరిగాయి. ఆ మూడిళ్లలో కుటుంబ సభ్యులు లేకపోవడంతో చోరీ అయిన వస్తువుల విలువ తెలియలేదు. ఏఎస్పీ డి.ఎన్.కిషోర్, సీఐ పి.శ్రీనివాసరావు హుటాహుటిన సంఘటనా స్థలాలకు చేరుకొని విచారణ చేపట్టారు. పాలూరి నాగేశ్వరరావు ఇంట్లో భారీ దొంగతనం జరగడంతో విశాఖ నుంచి డాగ్స్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌ను తెప్పించి దొంగల కోసం గాలిస్తున్నారు.
రాత్రి గస్తీ నిర్వహించకపోతే కఠినచర్య
రాత్రి సమయాల్లో పోలీసులు గస్తీ నిర్వహించకపోతే కఠిన చర్యలు తీసుకుంటానని ఏఎస్పీ డి.ఎన్.కిషోర్ హెచ్చరించారు. వరుస చోరీలను దృష్టిలో పెట్టుకొని గురువారం రాత్రి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఆయన పోలీసులకు సూచనలు చేశారు. దొంగలను అదుపులోకి తీసుకుంటే రివార్డులను అందజేస్తామని తెలిపారు. రోజూ పట్టణంలో 10 బృందాలు గస్తీ తిరిగేవని, చోరీలను దృష్టిలో పెట్టుకుని సుమారు 50 మంది సిబ్బందితో 25 బృందాలుగా విభజించి గస్తీని ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు.
నిద్రలో ఉండగా చోరీ
గురువారం తెల్లవారుజామున యానాం వెళ్లేందుకు విశాఖ నుంచి నా తమ్ముడు శ్రీనివాసరావు కుటుంబంతో బుధవారం రాత్రి మా ఇంటికి వచ్చారు. రాత్రి 10.30 గంటల వరకు అందరూ మాట్లాడుకొని వేర్వేరు గదుల్లో పడుకున్నాం. వేకువజామున 3.30 గంటల సమయంలో తమ్ముడు శ్రీనివాసరావు, భార్య లేచి టీ తాగుతూ సోఫాలో కూర్చున్నారు. గదిలో ఉండాల్సిన బంగారం పెట్టుకునే డబ్బా సోఫాలో ఉండటం చూశాడు. గదిలోకి వెళ్లి చూడగా బీరువాలోని సామాన్లన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. దీంతో ఇంట్లో దొంగలు పడినట్లు గ్రహించి పోలీసులకు సమాచారాన్ని అందజేశాం. కిటికీని తొలగించి దొంగలు లోపలికి ప్రవేశించారు.
- పాలూరి నాగేశ్వరరావు


