అమాత్యులకు టైం లేదట! | Amatya Time ledata! | Sakshi
Sakshi News home page

అమాత్యులకు టైం లేదట!

Aug 22 2013 2:59 AM | Updated on Nov 9 2018 5:52 PM

ఒకరు.. ఇద్దరు కాదు వేలాది మంది పింఛన్ లబ్ధిదారులు మంత్రులు, ఎమ్మెల్యే పుణ్యమా అని పింఛన్లు అందుకోలేకపోయారు. రెండేళ్ల నిరీక్షణ తర్వాత మంజూరైన పింఛన్లు..

కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఒకరు.. ఇద్దరు కాదు వేలాది మంది పింఛన్  లబ్ధిదారులు మంత్రులు, ఎమ్మెల్యే పుణ్యమా అని పింఛన్లు అందుకోలేకపోయారు. రెండేళ్ల నిరీక్షణ తర్వాత మంజూరైన పింఛన్లు.. మంత్రులకు సమయంలేక నిలిచిపోయూరుు. రెండో విడత రచ్చబండ, గ్రీవెన్స్‌సెల్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కోడ్ ముగిశాక పింఛన్లు మంజూరు చేసింది. సామాజిక భద్రత కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లాలో 34,691 మందికి ఆగస్టు 1న పింఛన్లు మంజూరు చేశాయి. ప్రస్తుతం ఆ సొమ్ము డీఆర్‌డీఏ ఖాతాలో మూలుగుతోంది.

రెండేళ్ల నిరీక్షణ తర్వాత..


 రెండేళ్లుగా జిల్లాలో ఒక్కరికి కూడా ప్రభుత్వం పింఛన్ మంజూరు చే యలేదు. చివరిగా అక్టోబర్, 2011లో మొదటి రచ్చబండ కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న వారికి పింఛన్లు మంజూరు చేశారు. ఆ తర్వాత రెండో విడత రచ్చబండలో పింఛన్ల కోసం ఇచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టారు. వీటితోపాటు ఎంపీడీఓలు ఆన్‌లైన్‌లో, గ్రీవెన్స్‌సెల్ ద్వారా జిల్లా నుంచి 39వేల వరకు పింఛన్లు కావాలని గ్రామీణాభివృద్ధి శాఖకు ప్రతిపాదనలు పంపారు. వాటిని పరిశీలించిన అధికారులు జిల్లాలో మొత్తం 34,691 మందికి పింఛన్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అందుకు సంబంధించిన డబ్బులను డీఆర్‌డీఏకు జమచేశారు. ఎన్నికల కోడ్ ముగిసినతర్వాత ఆగస్టు మొదటివారంలో వాటిని పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఈలోగా వాటిని పంపిణీ నిలిపివేయాలని హైదరాబాద్‌నుంచి ఫ్యాక్స్ ద్వారా డీఆర్‌డీఏకు ఉత్తర్వులు అందాయి.

 మంత్రులకు సమయం లేదట


 ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న నిరుపేదలకు పింఛన్లు మంజూరు అయితే వాటిని పంపిణీ చేయడానికి మన మంత్రులకు సమయమే ఉండడం లేదు. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ద్వారా పింఛన్లు పంపిణీ చేయాలని భావించిన ప్రభుత్వం వారు సమయం కేటాయించే వరకు వాటిని పంపిణీ చేయవద్దని ఆదేశాలు ఇవ్వడంతో మన అధికారులు మిన్నకుండిపోయారు.

 34,691 మందికి రూ.76,41,100


 రెండో విడత రచ్చబండ, ఆన్‌లైన్, గ్రీవెన్స్‌సెల్‌లో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా సొసైటీ ఎలిమినేషన్ రూరల్ పావర్టీ (సెర్ప్), డీఆర్‌డీఏల ద్వారా సామాజిక భద్రత కింద జిల్లాకు 34,691 మందికి పింఛన్లు మంజూరయ్యాయి. వృద్ధులు, వితంతువులు, చేనేతవృత్తిదారులు, గీత వృత్తిదారులకు నెలకు ఒక్కొక్కరికి రూ.200 పింఛన్‌ను సామాజిక భద్రత కింద ఇస్తున్నారు. వికలాంగులకు నెలకు రూ.500 పంపిణీ చేస్తున్నారు. కొత్తగా వృద్ధులు, వితంతువులు, చేనేత, గీత వృత్తిదారులకు 32,348, వికలాంగులకు 2343 మందికి పింఛన్లు మంజూరు చేసిన సర్కారు మొత్తం రూ. 76,41,100 విడుదల చేసింది. అయితే పంపిణీ నిలిచిపోవడంతో ఈ నగదును తాజాగా వెనక్కి పంపించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement