విభజన నిర్ణయంతోనే గడ్డుకాలం | All were damaged partition | Sakshi
Sakshi News home page

విభజన నిర్ణయంతోనే గడ్డుకాలం

Jan 23 2014 2:41 AM | Updated on Mar 18 2019 9:02 PM

విభజన నిర్ణయంతోనే గడ్డుకాలం - Sakshi

విభజన నిర్ణయంతోనే గడ్డుకాలం

కాంగ్రెస్ అధిష్టానవర్గం అనాలోచితంగా తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుందని పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మచిలీపట్నం టౌన్, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ అధిష్టానవర్గం అనాలోచితంగా  తీసుకున్న  రాష్ట్ర విభజన నిర్ణయంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ  గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుందని పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు  ఆగ్రహం వ్యక్తం చేశారు. బందరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో కార్యకర్తల అభిప్రాయాలను సేకరించేందుకు బుధవారం స్థానిక డీసీసీ కార్యాలయంలో  ఏఐసీసీ పరిశీలకుడు ఎన్‌ఎల్.నరేంద్రబాబు, కార్యదర్శి రామినీడి మురళీ  సమావేశం నిర్వహించారు.  

పార్లమెంటు పరిధిలోని ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలను పిలిపించి గోప్యంగా సమావేశమయ్యారు.  పలువురు కార్యకర్తలు మాట్లాడుతూ పార్టీ  రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకోవటంతో పార్టీ పరిస్థితి మరింత దిగజారిపోయిందన్నారు. పార్టీని పెద్దనాయకులే నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మచిలీపట్నం నియోజకవర్గానికి సంబంధించి ఎస్సీలు అధికంగా ఉన్నా ప్రాతినిధ్యంలో మాత్రం తమకు ప్రాధాన్యత ఇవ్వటం లేదని ఎస్సీ కార్యకర్తలు పరిశీలకుల దృష్టికి తీసుకొచ్చారు.

ఓట్లు మావి, సీట్లు మీవా అంటూ ప్రసాద్ అనే కార్యకర్త పరిశీలకులను ప్రశ్నించారు. పార్టీ నాయకుల్లో లోపం ఉందే కానీ కార్యకర్తల్లో కాదని పేర్కొన్నారు. అనంతరం నియోజకవర్గాల వారి జరిగిన పరిశీలకుల సమావేశంలో ఆయా నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల పేర్లను కార్యకర్తలు వివరించారు.

మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థుల పేర్ల పరిశీనలో మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ, మంత్రి పార్థసారథి, డీసీసీ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు, మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ ఎంవీవీ కుమార్‌బాబు, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శోభన్‌బాబు, అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిత్వానికి సంబంధించి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రొండి కృష్ణ, మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ ఎంవీవీ కుమార్‌బాబు, కాంగ్రెస్ నాయకులు చలమలశెట్టి ఆదికిరణ్, బలగం విజయశేఖర్, జన్ను రాఘవ, సోడిశెట్టి బాలాజీరావు, డాక్టర్ రాధికమాధవి, గుమ్మడి విద్యాసాగర్ పేర్లను పరిశీలకుల దృష్టికి కార్యకర్తలు తీసుకువచ్చారు. పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించి మంత్రి సారథికి ఎంపీ టికెట్ ఇస్తే నియోజకవర్గంలో ఆయన సతీమణి కమల పేరును ప్రతిపాదించారు.
 
దేవభక్తుని సుబ్బారావు, అన్నె చిట్టిబాబు పేర్లను కార్యకర్తలు సూచించారు. గుడివాడ నియోజకవర్గానికి పిన్నమనేని వెంకటేశ్వరరావు, పుప్పాల ఆంజనేయులు, అవనిగడ్డకు మండలి బుద్ధప్రసాద్, గన్నవరం ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, పామర్రుకు డీవై దాసు, కాటం రాజేష్  పేర్లను కార్యకర్తలు పరిశీలకుల వద్ద ప్రస్తావించారు.  సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు, కాంగ్రెస్ నాయకులు బోడపాటి బాబూరావు, కూనపరెడ్డి వెంకటేశ్వరరావు, గుమ్మడి విద్యాసాగర్, సోడిశెట్టి బాలాజీరావు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement