అమరావతిలో హైకోర్టు ఏర్పాటుపై నిరసన | advocates Protest against High Courts In Amaravathi | Sakshi
Sakshi News home page

అమరావతిలో హైకోర్టు ఏర్పాటుపై నిరసన

Jan 2 2019 12:00 PM | Updated on May 29 2019 3:25 PM

advocates Protest against High Courts In Amaravathi - Sakshi

లీగల్‌ (కడప అర్బన్‌) : రాయలసీమ హక్కుల పత్రమైన శ్రీబాగ్‌ ఒప్పందానికి శాశ్వత సమాధి కడుతూ చివరికి హైకోర్టును కూడా అమరావతిలో ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ రాయలసీమ న్యాయవాద జేఏసీ,  స్టూడెంట్స్‌ ఫోరం ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కోర్టు ఎదురుగా నిరసన ప్రదర్శన చేపట్టారు. నిరసనకారులు నల్లబ్యాడ్జీలు, నల్లజెండాలు  కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయలసీమ న్యాయవాదుల జేఏసీ కన్వీనర్‌ మస్తాన్‌వలి,  స్టూడెంట్స్‌ ఫోరం కన్వీనర్‌ డాక్టర్‌ మల్లెల భాస్కర్, కడప న్యాయవాదుల సంఘం అధ్యక్షులు పి.సుబ్రమణ్యంలు మాట్లాడుతూ చరిత్రలో రాయలసీమకు ఎలాంటి ద్రోహం జరిగిందో అలాగే అన్యాయాలు కూడా జరిగాయన్నారు. ఇందుకు నిదర్శనం రాయలసీమలో ఏర్పాటు చేయాల్సిన హైకోర్టును అమరావతికి పోవడమేనన్నారు. సీమ న్యాయవాదులు, విద్యార్థులు, యువకులు చేసిన పోరాటం అనాథ పోరాటంలా రాజకీయ పార్టీలు చూశాయే తప్ప పరిపాలన వికేంద్రీకరణలో భాగమైన డిమాండులాగా చూడలేదన్నారు.  సీమ చరిత్రలోనే ఇదొక చీకటిరోజని, చరిత్రలో రాయలసీమ హక్కుల పత్రమైన శ్రీబాగ్‌కు సమాధి కట్టిన రోజుగా నిలిచిపోతుందన్నారు.

 ముఖ్యమంత్రి చంద్రబాబు నియతృత్వంగా, అహంకార పూరితంగా తీసుకున్న ఈ నిర్ణయానికి బాధ్యవ వహించి తీరాల్సిందేనన్నారు. ప్రభుత్వ చర్య సీమ ప్రజల ఆకాంక్షలను హేళన చేసేవిధంగా, అవమానపరిచే విధంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతానికి ఏ హక్కు లేని విధంగా ఉందన్నారు. ఇక్కడ హైకోర్టు ఏర్పాటు చేయడంలో రాజకీయ పార్టీలన్నీ కూడా ద్రోహం చేసి ఒట్టి కపట ప్రేమను మాత్రమే చూపాయని, ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు.  సీమలోనే హైకోర్టు ఏర్పాటు చేయాలని గత ఏడాది దాదాపు వంద రోజులపాటు న్యాయవాదులు విద్యార్థి ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఎంత పోరాటం చేసినా దానిని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా కనీసం  ఒక స్పష్టమైన ప్రకటన చేయకుండా ఏకపక్షంగా వ్యవహారించారన్నారు. అమరావతిలో ఇప్పుడు హైకోర్టు కూడా ఏర్పాటు చేయడాన్ని తామంతా బహిష్కరిస్తున్నామని, ఇది రాయలసీమ ప్రజల హక్కుల పత్రానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర అని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు ఇన్నిరోజులు కలిసి ఉండటానికి కారణమైన శ్రీబాగ్‌ ఒప్పం దాన్ని ప్రభుత్వ చర్యలు నేటితో కాలం చెల్లిందని, దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యత వహించి ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. ఇప్పటికే గతంలో హైదరాబాదులాగానే ప్రస్తుతం అమరావతిలో కూడా రాజధాని విద్య, వైద్య సంస్థలు, పరిశోధన సంస్థలు కేంద్రీకరించడమే కాకుండా చివరికి కోర్టును కూడా అక్కడే  ఏర్పాటు చేయడం ఏమిటని నిలదీశారు.  కార్యక్రమంలో ఓటీడీఆర్‌ జిల్లా అధ్యక్షులు శివా రెడ్డి, న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షులు రాజ గోపాల్‌రెడ్డి, హోమియపతి డాక్టర్‌ శ్రీనివాసులు, ఎరుకల హక్కుల పోరాటసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ద్రాక్షం శ్రీనివాస్, రాయలసీమ స్టూ డెంట్‌ ఫెడరేషన్‌ జిల్లా కన్వీనర్‌ జగదీష్, కార్తీక్, కేశవ, నిఖిల్‌లతో పాటు పలువురు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement