సీమకు న్యాయం.. కర్నూలులో న్యాయ రాజధాని

Advocates And Kurnool People Praises CM YS Jagan Mohan Reddy - Sakshi

న్యాయ రాజధానిగా కర్నూలు

మంత్రివర్గ ఆమోదం.. అసెంబ్లీలోనూ బిల్లు  పాస్‌

శ్రీబాగ్‌ ఒప్పందాన్ని గౌరవించిన ప్రభుత్వం  

‘సీమ’ అభివృద్ధికి బాటలు

జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు 

బాణాసంచా కాల్చి సంబరాలు.. ఆలయాల్లో ప్రత్యేక పూజలు

మార్మోగిన ‘జై జగన్‌’ నినాదం

ప్రజాకాంక్ష నెరవేరింది. కర్నూలులో న్యాయ రాజధాని నిశ్చయమైంది. రాయలసీమకు మణిహారమై వెలుగొందనుంది. ప్రగతి వీచికలు ఇక్కడి నుంచే మొదలయ్యాయి. ఏళ్ల నాటి కల సాకారం అవుతుండడంతో ప్రజలు సంబరాల్లో మునిగిపోయారు. వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఎన్నో ఏళ్ల కల సాకారం 
రాయలసీమ గతంలో రాజధానిని త్యాగం చేసింది.  శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం కనీసం హైకోర్టు ఏర్పాటు చేసి న్యాయం చేయాలన్న ఆలోచన గత ప్రభుత్వానికి లేకపోయింది. పైగా కర్నూలుకు హైకోర్టు బెంచ్‌ ఇస్తామని గత ఎన్నికల ముందు హామీ ఇచ్చి మోసం చేశారు. ప్రస్తుతం సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి శ్రీబాగ్‌ ఒప్పందాన్ని గౌరవిస్తూ కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయడం అభినందనీయం. ఎన్నో ఏళ్ల కల సాకారం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. –పి.రవిగువేరా, రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు 

సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం 
వికేంద్రీకరణపై ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఒకే ప్రాంతంలో అభివృద్ధి కేంద్రీకృతం చేస్తే మరోసారి రాçష్ట్ర విభజన ఉద్యమం తెరపైకి వచ్చే అవకాశముంది. ఇప్పటికే రాజధానిగా కర్నూలు, హైదరాబాద్‌ కోల్పోయి తీవ్రంగా నష్టపోయాం. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం చాలా ఉంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సాకారం చేస్తోంది.
– ప్రొఫెసర్‌ శ్రీనివాసరావు, రాయలసీమ విశ్వవిద్యాలయం   


మహానందిలో బైక్‌ర్యాలీ నిర్వహిస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు, ప్రజలు

సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం.. ఆంధ్ర రాష్ట్రానికి తొలి రాజధానిగా ఎంపికైన ప్రాంతం.. శ్రీబాగ్‌ ఒడంబడికను తుంగలో తొక్కి రాజధాని మార్చడంతో దగాకు గురైన ప్రాంతం.. దశాబ్దాల తరబడి పాలకుల నిర్లక్ష్యంతో కునారిల్లిన ప్రాంతం.. అభివృద్ధి లేమితో కొట్టుమిట్టాడిన ప్రాంతం.. నిత్యం త్యాగాలతో కన్నీటి ‘సీమ’గా మిగిలిపోయిన ప్రాంతం.. ఇలాంటి ప్రాంతానికి ఇన్నేళ్ల తర్వాత సరైన ‘న్యాయం’ జరిగింది. రాయలసీమ ముఖద్వారంగా పేరుగాంచిన కర్నూలులో  ‘న్యాయ రాజధాని’ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సోమవారం ఉదయం మంత్రివర్గ ఆమోదం లభించగా..రాత్రి అసెంబ్లీలోనూ బిల్లు పాసయ్యింది. కర్నూలులో హైకోర్టుతో పాటు న్యాయ సంబంధ సంస్థలను నెలకొల్పి.. ‘న్యాయ రాజధాని’గా ఏర్పాటు చేసే బిల్లు ఆమోదం పొందడంపై జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు సంబరాల్లో మునిగిపోయారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిõÙకం చేశారు. న్యాయవాదులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు.

వికేంద్రీకరణతోనే సమగ్రాభివృద్ధి 
►ఆ దిశగా కృషి చేస్తున్న సీఎం జగన్‌కు కృతజ్ఞతలు 
►సీమాభివృద్ధికి టీడీపీ అడ్డుపడడం సిగ్గుచేటు 
►వైఎస్సార్‌సీపీ నేత బీవై రామయ్య

దశాబ్దాల తర్వాత న్యాయం 
ఆరు దశాబ్దాల కిందట కర్నూలు ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా ఉండేది. ఇన్ని దశాబ్దాల తర్వాత మళ్లీ ఇప్పుడు న్యాయ రాజధాని అవుతోంది. ఇన్నేళ్లలో ఎంతోమంది నేతలు కర్నూలుపైన, రాయలసీమపైన వల్లమాలిన ప్రేమ ఒలకబోశారు. బీజేపీ అధికారంలోకి వస్తే హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించారు. కర్నూలులో హైకోర్టు ఉండాలని, మరో అడుగు ముందుకేసి రాజధానే కర్నూలులో ఉండాలంటూ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించారు. కానీ కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైన తర్వాత వీరంతా మాటమార్చారు. రాయలసీమ అభివృద్ధిని అడ్డుకునేలా, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు కాకూడదనేలా  20–30 రోజులుగా రోజూ ప్రకటనలు చేస్తూ, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. చివరకు జిల్లావాసి అయిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపి సీమకు ద్రోహం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన తీరును స్వయాన సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య తీవ్రంగా వ్యతిరేకించారు.

చదవండి: మూడు రాజధానులకే ప్రజల మొగ్గు 

చంద్రబాబుతో అంటకాగుతూ, తమ మనోభావాలు దెబ్బతినేలా రామకృష్ణ ప్రవర్తిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలన్నది సీపీఐ పాలసీ అని, కానీ రామకృష్ణ జిల్లా అభివృద్ధి కంటే చంద్రబాబుతో దోస్తీకే ప్రాధాన్యమిచ్చారని ఆ పార్టీ శ్రేణులే ఆక్షేపిస్తున్నాయి. మరోవైపు టీడీపీ నేతలు జయనాగేశ్వరరెడ్డి, అఖిలప్రియ, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, తిక్కారెడ్డితో పాటు పలువురు రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ ఒకేచోట ఉండాలని, వికేంద్రీకరణ వద్దని ప్రకటనలు చేశారు. జిల్లాకు హైకోర్టు వస్తుంది..తద్వారా అభివృద్ధికి బాటలు పడతాయనే కనీస బాధ్యత కూడా లేకుండా ప్రవర్తించారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని  న్యాయవాదులు నగరంలో దాదాపు 100 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేసి తమ డిమాండ్‌ను ప్రభుత్వానికి తెలిపారు. అయినప్పటికీ విపక్షాలు మాత్రం హైకోర్టు రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశాయి.
 
జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు 
కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు బిల్లును అసెంబ్లీ ఆమోదించడంపై జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల్లోనూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. డోన్‌ పట్టణంలో టీటీసీ కాలేజీ ప్రిన్సిపాల్‌ చంద్ర ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు స్థానిక విఘ్నేశ్వర ఆలయంలో 101 టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. కర్నూలు కోర్టు ఆవరణలో న్యాయవాదులు మిఠాయిలు పంచుకున్నారు. రాయలసీమ విద్యార్థి సంఘం నాయకులు, విద్యార్థులు, న్యాయవాదులు భారీగా  కలెక్టరేట్‌ ఎదురుగా ఉన్న గాందీజీ విగ్రహం వద్దకు చేరుకుని బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

చదవండి: అమరావతి.. బాబు అవినీతి కలల రాజధాని

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి తెర్నేకల్‌ సురేంద్రరెడ్డి, నగర అధ్యక్షుడు రాజా విష్ణువర్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో రాజ్‌విహార్‌ సర్కిల్‌లో వైఎస్సార్, సీఎం జగన్‌ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కొండారెడ్డి బురుజు వద్ద స్థానికులు మిఠాయిలు పంచుకుని సంతోషం వ్యక్తం చేశారు. ఆలూరులో మంత్రి గుమ్మనూరు జయరాం సోదరుడు నారాయణస్వామి ఆధ్వర్యంలో సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.  శిల్పా భువనేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు మహానంది నుంచి గాజులపల్లె వరకూ ర్యాలీ నిర్వహించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గ వ్యాప్తంగా సంబరాలు జరిగాయి. మిగిలిన ప్రాంతాల్లోనూ ర్యాలీలతో హోరెత్తించారు.  

‘సీమ’ అభివృద్ధికి బాటలు వేసేలా.. 
పాలన, అభివృద్ధి వికేంద్రీకరణపై విపక్షాలు ఎంత యాగీ చేసినా ప్రభుత్వం మాత్రం  ‘న్యాయమైన’ నిర్ణయం వైపు మొగ్గు చూపింది. భవిష్యత్తులో ప్రాంతీయ అసమానతలకు చోటు లేకుండా, అన్ని ప్రాంతాల్లో సమాన అభివృద్ధి జరగాలన్న బాధ్యతాయుతమైన దృక్పథంతో మూడు రాజధానుల వైపు మొగ్గు చూపింది. అందులో భాగంగా న్యాయరాజధానిగా కర్నూలును నిర్ణయించింది. రాయలసీమ అభివృద్ధి బాటలో పయనించాలన్న సంకల్పంతో ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఈ చరిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top