మూడు రాజధానులకే ప్రజల మొగ్గు 

Rapaka Vara Prasada Rao Comments On Andhra Pradesh Capital - Sakshi

బిల్లును స్వాగతిస్తున్నామన్న రాపాక వరప్రసాద్‌ 

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై విచారణ జరపాలన్న నిమ్మల  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులకే ప్రజాభిప్రాయం అనుకూలంగా ఉందని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు చెప్పారు. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుపై సోమవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ నుంచి వలసలు ఆగాలంటే ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందాలని, అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోన్‌రెడ్డి బిల్లు తీసుకురావడాన్ని స్వాగతిస్తున్నానని చెప్పారు. అమరావతిలో జరిగిన అవినీతిని బట్టబయలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలకు ఎకరాన్ని రూ.4 కోట్లకు అమ్మిన చంద్రబాబు ప్రభుత్వం తమ సొంత మనుషులకైతే కేవలం రూ.50 లక్షలకే కట్టబెట్టడాన్ని తప్పుబట్టారు. 

వికేంద్రీకరణపై రెఫరెండం నిర్వహించాలి: అనగాని 
పరిపాలనా వికేంద్రీకరణపై రెఫరెండం జరపాలని టీడీపీ సభ్యుడు అనగాని సత్యప్రసాద్‌ కోరారు. ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో రూ.40వేల కోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయని.. వికేంద్రీకరణ పేరిట రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దని సూచించారు. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. రాజధాని ప్రాంతంలో చనిపోయిన రైతులకు సభ నివాళులు అర్పించాలన్నారు. అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందన్న ఆరోపణలపై విచారణ జరిపించాలే తప్ప తరలించవద్దని కోరారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై సిట్టింగ్‌ జడ్జితో విచారణ నిర్వహించాలని సూచించారు.  

ఆ భవనాల్లో 65 వాళ్లవే: మంత్రి బుగ్గన 
ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి బుగ్గన జోక్యం చేసుకుంటూ అమరావతిని సంపద సృష్టించే కేంద్రంగా టీడీపీ నేతలు మార్చుకున్నారని ఎద్దేవా చేశారు. ఈ ప్రాంతంలో అద్దెకు తీసుకున్న 120 భవనాలు ఎవరికి చెందినవో తెలుసుకునేందుకు.. 80 భవనాలపై సర్వే జరిపితే ఆశ్చర్యపరిచే వాస్తవాలు బయటపడ్డాయన్నారు. ఆ 80లో 65 భవనాలు టీడీపీ వాళ్లవేనని వివరించారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top