వేడివేడి గరళం

Adulterated tea in the whole of the state - Sakshi

రాష్ట్రవ్యాప్తంగా నిత్యం జనం గొంతుల్లోకి కల్తీ టీ

సాక్షి, అమరావతి: చాలా మందికి నిద్ర లేవగానే కాస్తంత టీ తాగితే కానీ తెల్లారదు. సమయానికి ఇంట్లో లేకుంటే బయటైనా సరే సింగిల్‌ ఛాయ్‌ పడాల్సిందే. వేడివేడిగా నాలుగు చుక్కలు గొంతులోకి దిగితేగానీ బద్ధకం వదలదు మరి! కొంతమంది ఎంత దూరమైనా అలవాటైన చోటకే వెళుతుంటారు. ఇక నుంచి బయట దుకాణాల్లో టీ తాగాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిందే. మనం తాగే టీ నీళ్లు ఆవిరితోపాటు వేడివేడిగా విషం కక్కుతున్నాయి. ఒకసారి వాడిన టీ పొడి వ్యర్థాలతో పాటు ప్రమాదకరమైన రసాయనాలను అందులో కలిపి జనం గొంతుల్లోకి దించుతున్నారు. 

చిక్కగా, రుచిగా కల్తీ టీ...
ఇన్నాళ్లూ పాలూ నీళ్లూ ఆహార పదార్థాలకే పరిమితమైన నకిలీ మాఫియా ఇప్పుడు కోట్లలో వ్యాపారం జరిగే టీ పొడి మీద కన్నేసింది. కల్తీ టీ పొడిని క్వింటాళ్లకు క్వింటాళ్లే తయారు చేసి హోటళ్లకు సరఫరా చేస్తున్న తీరు జలదరింపు కలిగిస్తోంది. మరింత చిక్కగా, రుచిగా ఉండే ఈ కల్తీ టీ పొడికి అలవాటుపడ్డ వినియోగదారులు పదేపదే అక్కడకే వెళ్తున్నారు. ఒకటికి రెండు సార్లు తాగి ఆస్వాదిస్తున్నారు. దీని వెనకాల కల్తీని ఎవరూ గుర్తించలేనంతగా రూపొందిస్తున్న నకిలీ మాఫియా జనం ఆరోగ్యంతో చెలగాటమాడుతూ సొమ్ము చేసుకుంటోంది.

ధర తక్కువ.. రుచి ఎక్కువ
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని పట్టణ కేంద్రాల్లో కల్తీ టీపొడినే వాడుతున్నారు. దీనికి కారణం రేటు చాలా తక్కువగా ఉండటం. ప్రముఖ బ్రాండ్‌లకు చెందిన పావు కిలో టీ పొడి రూ.130 వరకు ఉండగా కల్తీ టీపొడి మాత్రం కిలో రూ. 120కే అందుబాటులో ఉంది. దీంతో టీ షాపుల యజమానులు లేబుల్‌ టీ ప్యాకెట్ల వైపే మొగ్గుచూపుతున్నారు. రసాయనాలు కలపడంతో వినియోగదారులు ఆకర్షితులు అవుతున్నందున కల్తీ టీపొడి వైపే మొగ్గుచూపుతున్నారు. కల్తీకి సంబంధించి దుకాణదారులకు సైతం అంతుచిక్కని రీతిలో ఉండేలా తయారీదారులు జాగ్రత్త పడుతున్నారు.

తెలంగాణ కూ సరఫరా
రాష్ట్రంలోని ప్రధాన టీ స్టాళ్లన్నిటిలోనూ కల్తీ టీ పొడినే వాడుతున్నట్టు అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. లేబుల్‌ లేకుండా డబ్బాల్లో, ప్యాకెట్లలో సరఫరా అవుతున్న కల్తీ టీ పొడి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, విజయవాడ, గుంటూరు జిల్లాల్లో ఉత్పత్తి చేస్తున్నట్టు వెల్లడైంది. గతంలో నెల్లూరు జిల్లా పొదలకూరులో ఒక్కరోజే 200 క్వింటాళ్ల కల్తీ టీపొడిని సీజ్‌చేసి నిర్వీర్యం చేశారు. కల్తీకారం తయారవుతున్న గుంటూరు, విజయవాడలో నకిలీ టీ పొడి భారీగా ఉత్పత్తి చేస్తున్నట్టు వెల్లడైంది. విశాఖపట్నం, వైఎస్సార్, ప్రకాశం జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్, హైదరాబాద్, వరంగల్, మెదక్‌ జిల్లాలకు సరఫరా చేస్తున్నట్టు అధికారుల పరిశీలనలో తేలింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top