నేడు అబుల్‌ కలాం విద్యా పురస్కారాలు | Abdul Kalam Education Awards On 11-11-2019 | Sakshi
Sakshi News home page

నేడు అబుల్‌ కలాం విద్యా పురస్కారాలు

Nov 11 2019 5:09 AM | Updated on Nov 11 2019 9:13 AM

Abdul Kalam Education Awards On 11-11-2019 - Sakshi

ఒంగోలు టౌన్‌/సాక్షి, అమరావతి : ఈ ఏడాది టెన్త్, ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్‌ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ విద్యా పురస్కారాలను అందజేయనున్నట్లు విదాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు. ఒంగోలు సంతపేటలోని తన క్యాంపు కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ జిల్లాకు ఆ జిల్లాలో అక్కడి మంత్రులు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఈ పురస్కారాలను అందిస్తారన్నారు.

గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంపొందించేందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంను ప్రవేశపెడుతున్నట్లు ఆయన స్పష్టంచేశారు. డీఎల్‌టీ, డైట్‌ వంటి వాటిని టీచర్స్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లుగా మార్చనున్నట్లు మంత్రి తెలిపారు. వీటి ద్వారా సుశిక్షితులైన ఉపాధ్యాయులను తయారుచేస్తామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ఇఫ్లూ, రీచల్‌ ఇన్‌స్టిట్యూట్‌ వంటి వాటితో ఒప్పందాలు చేసుకుని ఇంగ్లిష్‌ మీడియం బోధించే టీచర్లకు మరింత తర్ఫీదునిస్తామన్నారు.

ఎస్సీ గురుకులాల నుంచి 189 మంది ఎంపిక
ఇదిలా ఉంటే.. అబుల్‌ కలాం విద్యా పురస్కారాలకు రాష్ట్రవ్యాప్తంగా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల నుంచి మొత్తం 189 మంది ఎంపికయ్యారు. గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల నుంచి 47 మంది, మహాత్మా జ్యోతిబా ఫూలే వెనుకబడిన తరగతుల గురుకుల విద్యాలయాల నుంచి 45 మంది ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులకు ఎస్సీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి వి.రాములు, బీసీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణమోహన్, ఎస్టీ గురుకుల విద్యాలయాల సంస్థ ఇన్‌చార్జ్‌ కార్యదర్శి పి రంజిత్‌బాషా అభినందనలు తెలిపారు.  

14న సీఎం చేతుల మీదుగా నాడు–నేడు కార్యక్రమం
సీఎం వైఎస్‌ జగన్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నాడు–నేడు కార్యక్రమాన్ని ఈనెల 14న ఆయన చేతుల మీదుగా ఒంగోలులో ప్రారంభించనున్నట్లు మంత్రి సురేష్‌ చెప్పారు. అదేరోజు మిగిలిన జిల్లాల్లోనూ మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement