దుర్గ గుడి చైర్మన్‌కు అవమానం

Abasement On vijayawada kanaka durga temple chairman - Sakshi

తొలి దర్శనానికి అనుమతించని వైనం

ఉదయం మరోసారి అడ్డగింత

పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు

సీపీ క్షమాపణలు, తిరిగి పునరావృత్తం కానివ్వమని హామీ

ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అంటూ గొప్పలు చెప్పుకుంటున్న పోలీసులు.. ఆచరణలో మాత్రం ఆ రీతిగా వ్యవహరించడం లేదు. ప్రతిష్టాత్మకమైన దసరా శరన్నవరాత్రుల సమయంలో వారి వ్యవహారశైలిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయ పరిసరాల్లో ఎక్కడిక్కడ గేట్లకు తాళాలు వేసి భక్తులను, ఆలయ సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ముఖ్యంగా అంతరాలయంలో భక్తుల పట్ల చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఇదే రీతిన ఆదివారం గుడి చైర్మన్‌ గౌరంగబాబును దర్శనానికి అనుమతించకుండా అవమానించారు. దీంతో నగర సీపీ వచ్చి క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోలీసుల తీరు మార్చుకుని మిగిలిన రోజులైనా ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక భావన దెబ్బతినకుండా చూడాలని భక్తులు కోరుకుంటున్నారు.

సాక్షి, అమరావతి బ్యూరో: ఇంద్రకీలాద్రిపై అత్యుత్సాహంతో పోలీసులు విమర్శల పాలవుతున్నారు. తొలిరోజు నుంచి దురుసు వ్యవహారశైలితో వివాదాస్పదమవుతుండగా..  ఆదివారం దుర్గగుడి చైర్మన్‌ యలమంచలి గౌరంగబాబును పోలీసులు అవమానించారు. అమ్మవారి జన్మనక్షత్రం రోజు జరిగే విశేష పూజలో ఈవో, కమిషనర్, దేవాదాయశాఖ కమిషనర్, దుర్గగుడి చైర్మన్‌లకు తొలి పూజలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీ. అయితే పోలీసుల అత్యుత్సాహంతో చైర్మన్‌ను తొలి పూజకు వెళ్లకుండా చేశారు. తాను గుడి చైర్మన్‌ అని చెప్పుకున్నప్పటికీ ఉన్నతాధికారుల ఆదేశాలంటూ ఆపేశారు. 

ఉదయం అదే తంతూ..
తీవ్ర మనస్థాపంతో వెళ్లిన చైర్మన్‌కు తిరిగి ఉదయం కూడా అదే సంఘటన ఎదురైంది. ఉదయం 11 గంటల సమయంలో కుటుంబ సభ్యులతో కలసి వచ్చిన గౌరంగబాబును దర్శనానికి వెళ్లకుండా డ్యూటీలో ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. తాను ఆలయ చైర్మన్‌ను అంటూ పదేపదే చెప్పినా ఫలితం లేకుండా పోయింది. అవమానంగా భావించి వెంటనే పాలకమండలి సమావేశం ఏర్పాటుకు ఇతర సభ్యులకు సమాచారం ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాత్రి తెలియక జరిగిందనకుంటే మళ్లీ ఇప్పుడు కూడా ఇలా జరగడం చాలా ఆక్షేపణీయం అని వ్యాఖ్యానించారు. కనీసం తాన చైర్మన్‌ చాంబర్‌కు వెళ్లడానికైనా అనుమతించమన్నా నిరాశే ఎదురైంది. నాకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్య భక్తుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చన్నారు. 

సీపీ క్షమాపణలు..
గౌరంగబాబుకు జరిగిన అవమానాన్ని తెలుసుకున్న సీపీ ద్వారాకా తిరుమలరావు ఇంద్రకీలాద్రికి చేరుకుని దేవస్థానం చైర్మన్, సభ్యులు, ఈవోతో చర్చించారు. అనంతరం వారందరితో కలసి సీపీ మీడియాతో మాట్లాడుతూ చైర్మన్‌ను దర్శనానికి వెళ్లనీయకపోవడం దురదృష్టకరం అని వ్యాఖ్యానించారు. జరిగిన తప్పుకు చింతిస్తున్నామన్నారు. ఈ చర్యకు పాల్పడిన అధికారిని గుర్తించామని, విధుల నుంచి తొలగించామని పేర్కొన్నారు. తమ అధికారి చేసిన తప్పుకు తాను బాధ్యత తీసుకుంటూ చైర్మన్‌కు క్షమాపణలు చెబుతున్నానని చెప్పారు. ఇక మీదట ఇలాంటివి పునరావృత్తం కావని హామీ ఇచ్చారు.

 నియంత్రణ కష్టసాధ్యం 
సత్యనారాయణపురం(విజయవాడ సెంట్రల్‌): భక్తుల్ని నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారు. అమ్మవారి దర్శనం కోసం వినాయకుని గుడి నుంచి క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అయితే కొంతమంది భక్తులు క్యూలైన్‌లో కాకుండా టోల్‌గేట్‌ ద్వారా ఘాట్‌రోడ్డు మీదుగా వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని ఆ విధంగా వెళ్లకుండా నియంత్రించాలి కానీ అక్కడి విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు అది స్థాయికి మించిన పనైంది. క్యూలైన్‌ వెలుపలి నిల్చుని ఉన్న భక్తులు అదునుచూసి ఒక్కసారిగా ఉరకలు వేసి క్యూలైన్‌లోకి చొచ్చుకుపోయారు. దీంతో అప్పటికే వినాయకుని గుడి సమీపం నుంచి క్యూలైన్‌లో వస్తున్న భక్తులు ఆందోళనకు దిగారు. ఎంతసేపటికీ కొండపైకి వెళ్లే వాహనాలపైనే దృష్టిపెట్టడంతో భక్తుల మధ్య వివాదాలు చోటుచేసుకున్నాయి. 

అలంకారప్రాయంగా రిసెప్షన్‌
మూలానక్షత్రం పురస్కరించుకుని అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఎటువంటి వివాదాలు చోటుచేసుకోకుండా ప్రజాప్రయోజనార్థం ఏర్పాటుచేసిన టోల్‌గేట్‌ రిసెప్షన్‌ సెంటర్‌ అలంకార ప్రాయంగా మారింది. ఇక్కడ 20కు పైగా పోలీసు శాఖ ఉద్యోగులు చేస్తున్నారు. భక్తుల కనీస అవసరాలు తీర్చడంలోనూ విఫలమయ్యారని భక్తులు ఆరోపిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top