నా చావుకు కారణం డాక్టర్, ఆయన భార్యే! | Sakshi
Sakshi News home page

నా చావుకు కారణం డాక్టర్, ఆయన భార్యే!

Published Sat, Mar 25 2017 11:23 PM

నా చావుకు కారణం డాక్టర్, ఆయన భార్యే! - Sakshi

నరసన్నపేట : శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని నిక హడ్కో కాలనీకి చెందిన కాడింగుల వెంకట్‌ (40) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం కలిగించింది.

సాయంత్రం 4 గంటల సమయంలో వెంకట్‌ తాను నివాసం ఉంటున్న ఇంట్లోనే ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యాహ్నం 3 గంటల వరకూ కుటుంబ సభ్యులతో బాగానే మాట్లాడిన వెంకట్‌.. గంట వ్యవధిలోనే మృతి చెందడంతో భార్య అన్నపూర్ణ, పిల్లలు సోనాలిక, యోగి, ఇతర కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

నా చావుకు కారణం డాక్టర్, ఆయన భార్యే.. : వెంకట్‌ సూసైడ్‌ నోట్‌..
తన చావుకు మమత నర్సింగ్‌ హోం డాక్టర్‌ పొన్నాన సోమేశ్వరరావే కారణమని మృతుడు వెంకట్‌ తన సూసైడ్‌ నోట్‌లో స్పష్టం చేశాడు. మృతదేహాంపై ఉన్న బనీనుకు పిన్నీసుతో  అతికించి ఉన్న సూసైడ్‌ నోట్‌ను భార్య అన్నపూర్ణ విలేకరులకు చూపించారు. ‘మన ఊరి డాక్టర్‌ సోమేశ్వరరావుతో వివాదం ఉన్న  విజయ్‌ ఆగస్టు 24న హత్యకు గురయ్యాడు. హత్య కేసులో డాక్టర్‌తోపాటు, ఆయన బంధువు రెడ్డి బుచ్చిబాబు నన్ను ఇరికించారు. నా భార్య, పిల్లలను పెంచుకొనే పరిస్థితి లేకుండా నన్ను చాలా మోసం చేశారు. సోమేశ్వరరావు ఇస్తామన్న డబ్బులు కూడా ఇవ్వలేదు. నా వ్యాపారం పోయి చివరికి మానసికంగా కుంగిపోయాను. నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు. నా భార్య చాలా కుంగిపోయింది. నా చావుకు కారణం పొన్నాన సోమేశ్వరరావు, ఆయన భార్యే..’ అని సూసైడ్‌ లెట్‌లో తన ఆవేదన తెలిపాడు.

నా భర్త మృతికి డాక్టరే కారణం..
‘నా భర్తతో డాక్టర్‌ సోమేశ్వరరావు చేయకూడని పని చేయించారు. మాకు సంఘంలో తీవ్ర అవమనాలకు గురి చేశాడు. çవిజయ్‌ హత్య సందర్భంగా ఇస్తామన్న డబ్బు కూడా ఇవ్వలేదు. దీంతో ఉన్న పని పోయి నా భర్త వీధినపడ్డాడ’ని వెంకట్‌ భార్య అన్నపూర్ణ ఆవేదన వ్యక్తం చేసింది. డాక్టర్‌పై తగిన చర్యలు తీసుకోవాలని కోరింది.

ఎస్సై పరిశీలన..
సమాచారం అందుకున్న నరసన్నపేట ఎస్సై ఎన్‌.లక్ష్మణ సంఘటనా స్థలానికి చేరుకు ని మృతదేహన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. ఆత్మహత్యకు ముందు వెంకట్‌ స్నానం చేసి దేవుడి గదిలో దీపం పెట్టినట్లు తెలుస్తోంది.

మృతుడు హత్య కేసులో నిందితుడు
గత ఆగస్టు 24న జరిగిన అదే కాలనీకి చెందిన మల్లా విజయ్‌ హత్య కేసులో వెంకట్‌ ఎ–4 నిందితుడు. అప్పట్లో ఈ కేసు తీవ్ర సంచలనం కలిగించింది. విజయ్‌ను హత్య చేయడంలో వెంకట్‌ పాత్ర కీలకం. ప్రస్తుతం అంతా ఈ వ్యవహారాన్ని మరిచిపోతున్న తరుణంలో వెంకట్‌ ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశమైంది. స్థానిక మమత నర్సింగ్‌ హోం డాక్టర్‌ పి.సోమేశ్వరరావుకు.. హత్యకు గురైన విజయ్‌కు వివాదం ఉంది. ఈ నేపథ్యంలోనే విజయ్‌ను వెంకట్‌తో పాటు ఇతరుల సహాయంతో సోమేశ్వరరావు హత్య చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు కూడా ఈ మేరకు కేసు నమోదు చేశారు. విజయ్‌ హత్యోదంతంపై కోర్టులో చార్జిషీట్‌ వేసేందుకు చర్యలు తీసుకుంటుండగా.. వెంకట్‌ ఆత్మహత్య చేసుకోవడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది.

Advertisement
Advertisement