9 మందిపై సస్పెన్షన్ వేటు | 9 suspended | Sakshi
Sakshi News home page

9 మందిపై సస్పెన్షన్ వేటు

Jul 17 2015 12:59 AM | Updated on Sep 3 2017 5:37 AM

‘ఉపాధి’ నిధులను మింగేసిన తొమ్మిది మందిపై వేటుపడింది. వారందర్నీ సస్పెండ్ చేస్తూ గురువారం రాత్రి కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు.

 సాక్షి ప్రతినిధి, విజయనగరం : ‘ఉపాధి’ నిధులను మింగేసిన తొమ్మిది మందిపై వేటుపడింది. వారందర్నీ సస్పెండ్ చేస్తూ గురువారం రాత్రి కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు.  ‘సాక్షి’లో వచ్చిన కథనాలు అధికారుల్ని కదలించాయి.  అటు చెరువు గట్ల అభివృద్ధి పనుల అవినీతికి, ఇటు హార్టికల్చర్ అక్రమాలకు ఒకే ఉద్యోగుల బృందం కారణమని జిల్లా జల యాజమాన్య సంస్థ(డ్వామా) వర్గాలు ప్రాథమిక నిర్ణయానికొచ్చాయి.   తెర్లాంలో కుమ్మక్కై వ్యవహారాన్ని నడిపాయని అభిప్రాయపడ్డాయి.
 
  ‘సాక్షి’లో ‘గట్టు తెగిన అవినీతి’, ‘మొక్కల మాటున మెక్కేశారు’ శీర్షికన ప్రచురించిన కథనాల్ని నిశితంగా పరిశీలించి, క్షేత్ర స్థాయిలో విచారణ బృందాలు తనిఖీ చేస్తున్నాయి. ఇప్పటికే రికార్డులన్నీ సీజ్ చేశాయి. ఎంబుక్‌లను పరిశీలిస్తున్నాయి. ఈ రెండింటిలోనూ అదే ఉద్యోగులు అవినీతికి పాల్పడినట్టు డ్వామా అధికారులు అంచనాకు వచ్చారు. గురువారం సాయంత్రమే  కలెక్టర్‌కు రిపోర్టు  సమర్పించారు. ఆ వెంటనే   వారినక్కడ కొనసాగించడం సరికాదని, వెంటనే  రిలీవ్ చేయాలని మండల అధికారులకు ఉత్తర్వులు పంపించారు. అంతటితో ఆగకుండా రాత్రి 8.30గంటల సమయంలో ఇందులో ప్రమేయం ఉన్న వారందర్నీ సస్పెండ్ చేస్తూ కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని డ్వామా పీడీ ప్రశాంతి ‘సాక్షి’ వద్ద ధ్రువీకరించారు. ఒక ఇంజినీరింగ్ కన్సల్టెంట్, నలుగురు టెక్నికల్ అసిస్టెంట్లు, ముగ్గురు కంప్యూటర్ ఆపరేటర్లు, ఒక ఏపీఓతో పాటు ఎంపీడీఓ వ్యవహారాన్ని తప్పు పట్టారు.
 
 అడిషనల్ పీఓ ఎస్.ఈశ్వరమ్మ, జూనియర్ ఇంజినీర్(ఇంజినీరింగ్ కన్సల్టెంట్) ఎం.భాస్కరరావు, టెక్నికల్ అసిస్టెంట్లు ఎస్.రామకృష్ణ, ఎం.సునీత, ఎస్.శ్రీనివాసరావు, ఆర్.శంకరరావు,  కంప్యూటర్ ఆపరేటర్లు ఎం.వి.రమణారావు, ఎం.రవికుమార్,  వి.సూర్యనారాయణలను సస్పెండ్ చేశారు.  అంతేకాకుండా బాధ్యతారాహిత్యంగా ఉన్నారన్న అభియోగంతో ఎం పీడీఓపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.  కాగా,   ఈ మొత్తం వ్యవహారంలో ఇంజినీరింగ్ కన్సల్టెంట్ కేంద్ర బిందువుగా ఉన్నారని ఆరోపణలొస్తున్నాయి. అంతా ఆయనే చేశారని ఇప్పటికే అధికార వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇక, ఎంపీడీవో బాధ్యతారాహిత్యాన్ని డ్వా మా వర్గాలు ఎత్తి చూపుతున్నాయి.  పనుల్ని మరింతగా పర్యవేక్షించి, అవతవకలకు ఆస్కారం లేకుండా చూసుకోవల్సి ఉంది. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని,  పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందని డ్వామా వర్గాలు అభిప్రాయపడ్డాయి. నిర్లక్ష్యంగా ఉండడం వెనుక కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
 
 సిబ్బంది జేబులోకి 4 రోజుల వేతనం
 చెరువు పనులు, మొక్కల పెంపకంలో జరిగిన అవకతవకలకు కారణమైన తెర్లాం  ఉపాధి సిబ్బందిపై తాజాగా మరికొన్ని ఆరోపణలు వచ్చాయి.  తెర్లాం మండలంలోని పనుకువలస పంచాయతీ, సోమిదవలసలో  మే 21 నుంచి 27 వరకు జరిగిన ఉపాధి పనుల్లో అవకతవకలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.  ఒక వారం పనులు చేస్తే...రెండో వారం పనులు చేయకపోయినా...రెండు వారాల్లో పనులు చేసినట్లు మస్తర్లు వేసి సిబ్బంది భారీగా స్వాహాకు పాల్పడినట్లు తెలిసింది.  రెండు రోజులు  పనులు చేపట్టగా మొత్తం ఆరు రో జులకు మస్తర్లు వేసి   పే-ఆర్డర్ నం.1500766లో రూ.2,38,878లు డ్రా చేసినట్టు ఆరోపణలొచ్చాయి.    ఈ పే ఆర్డర్‌లో సుమారు 70 మంది వేతనదారులకు, అత్యధిక వేతనము రూ.145 నుంచి రూ 180ల వరకు చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ పేమెంట్‌లో  రెండు రోజుల మొత్తం వేతనదారులకిచ్చి, మిగతా నాలుగు రోజుల వేతనం సిబ్బంది జేబులో వేసుకున్నట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement