రాష్ట్రంలో 633 రిజిస్ట్రేషన్లు 

633 registrations in Andhra Pradesh On First Days after lockdown - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ తర్వాత మంగళవారం రిజిస్ట్రేషన్‌ సేవలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు 633 రిజిస్ట్రేషన్లు జరిగాయి. కోవిడ్‌–19 కంటైన్‌మెంట్‌ జోన్ల వెలుపల ఉన్న కార్యాలయాలను తెరచి రిజిస్టేషన్‌ సేవలను పునరుద్ధరించాలని ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు మంగళవారం రాష్ట్రంలో 108 సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయాలు పనిచేశాయి. కంటైన్‌మెంట్‌ జోన్లలోనే కలెక్టర్ల సూచన మేరకు కొన్ని రెడ్‌ జోన్లలోని కార్యాలయాలనూ తెరవలేదు. దీంతో రాష్ట్రంలోని 295 సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయాల్లో 187 ప్రారంభంకాలేదు.

ఎనీవేర్‌ రిజిస్ట్రేషన్‌ సౌకర్యం ఉన్నందున కంటైన్‌మెంట్‌ జోన్ల పరిధిలోని ఆస్తులను కూడా వేరేచోట్ల రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. కరోనా వ్యాప్తి చెందకుండా నియంత్రణకోసం రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. కార్యాలయాల్లో భౌతిక దూరం అమలు చేయడంతోపాటు బయోమెట్రిక్‌ యంత్రాలను ప్రతిసారీ శానిటైజ్‌ చేశారు. మంగళవారం రిజిస్ట్రేషన్ల వల్ల రుసుముల రూపేణా ప్రభుత్వానికి రూ.కోటి ఆదాయం వచ్చింది. 

ఆదాయ పెంపుపై దృష్టి: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌  
ఆదాయ పెంపుపై దృష్టి పెట్టాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులకు కమిషనర్‌ సిద్ధార్థ జైన్‌ సూచించారు. దీనిపై సోమవారంలోగా సూచనలు పంపాలన్నారు. ఆ శాఖ డీఐజీ, డీఆర్‌లతో మంగళవారం ఆయన ఈ మేరకు వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top