‘నారాయణ’ దోపిడీ రూ.104 కోట్లు! | 104 crore public money has been misleaded with Narayana experiments | Sakshi
Sakshi News home page

‘నారాయణ’ దోపిడీ రూ.104 కోట్లు!

Jun 6 2019 3:27 AM | Updated on Jun 6 2019 3:27 AM

104 crore public money has been misleaded with Narayana experiments - Sakshi

సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో గత మూడేళ్లలో మున్సిపల్‌ స్కూళ్లలో అప్పటి మంత్రి పి.నారాయణ చేపట్టిన ప్రయోగాల పుణ్యమా అని రూ.104 కోట్ల మేర ప్రజాధనం దుర్వినియోగమైంది. మున్సిపల్‌ పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన కెరీర్‌ ఫౌండేషన్‌ కోర్సులు, అకడమిక్‌ ఫౌండేషన్‌ కోర్సులు, స్పార్క్‌ బ్యాచులు, స్టార్‌ బ్యాచులతో కొందరు ప్రైవేట్‌ వ్యక్తులు లాభపడ్డారు తప్ప విద్యార్థులకు ఒరిగిందేమీ లేదని నిపుణులు పేర్కొంటున్నారు. నారాయణ విద్యాసంస్థల్లో రకరకాల పేర్లతో బ్యాచులు ఉంటాయి. అలాంటి విధానాన్నే మున్సిపల్‌ స్కూళ్లలోనూ ప్రవేశపెట్టారు. ఇందుకోసం నారాయణ విద్యాసంస్థల సిబ్బందిని ప్రత్యేకంగా నియమించి, భారీగా గౌరవ వేతనాలు చెల్లించారు. ఈ కోర్సులు బోధించేందుకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, గైడ్లు, ఇతర మెటీరియల్‌ అంతా నారాయణ విద్యాసంస్థలకు చెందినదే. ఆయా పుస్తకాల కోసం రూ.కోట్లు ఖర్చు చేశారు. అంతేకాకుండా అర్బన్‌ లోకల్‌బాడీ కో–ఆర్డినేటర్లు, కన్సల్టెంట్లు, ఏఎఫ్‌సీ టీచర్లు, సీఎఫ్‌సీ టీచర్లు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది.. ఇలా వేలాది మందిని నియమించారు. వారికి రూ.వేలల్లో జీతాలు చెల్లించారు. 

దోచుకున్న వాళ్లకు దోచుకున్నంత 
ఫౌండేషన్‌ కోర్సుల కోసం నారాయణ విద్యాసంస్థలకు చెందిన పాఠ్యపుస్తకాలనే  వినియోగించారు. నేరుగా నారాయణ విద్యాసంస్థల మెటీరియల్‌గా చూపించకుండా వాటి అట్టలను మార్చేసి, వాటిని వేరే సంస్థల నుంచి కొనుగోలు చేసినట్లు చూపించారు. ఇందుకోసం ఏకంగా రూ.8.50 కోట్లు వెచ్చించారు. మున్సిపల్‌ స్కూళ్లలో ‘నో బ్యాగ్‌ డే’ను అమలు చేయాలని మున్సిపల్‌ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. నో బ్యాగ్‌ డే సందర్భంగా వివిధ కార్యక్రమాల నిర్వహణకు మున్సిపల్‌ శాఖ నుంచి రూ.85.15 లక్షలు మంజూరు చేశారు. ఈ నిధులు స్కూళ్లకు చేరలేదని, టీడీపీ ప్రభుత్వ పెద్దల జేబుల్లోకి వెళ్లిపోయాయని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. విద్యార్థుల సమాధాన పత్రాలను(ఓఎమ్మార్‌) స్కాన్‌ చేయడానికి స్కానింగ్‌ యంత్రాలు, నెట్‌ చార్జీలు, కంప్యూటర్‌ ఆపరేటర్ల కోసం ప్రతిఏటా రూ.54.51 లక్షలు ఖర్చు చేసినట్లు రికార్డుల్లో చూపిస్తున్నారు. ఈ నిధులన్నీ పక్కదారి పట్టాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  

నిధులన్నీ బూడిదలో పోసిన పన్నీరే...
మున్సిపల్‌ స్కూళ్లలో చేపట్టిన ప్రయోగాత్మక బోధనకు భారీ ఎత్తున నిధులు చెల్లించేశారు. ప్రైమరీ యూఎల్‌బీ కో–ఆర్డినేటర్ల పేరిట ఏడాదికి రూ.38.25 లక్షల చొప్పున మూడేళ్ల పాటు డ్రా చేశారు. ప్రైమరీ కన్సల్టెంట్ల హానరోరియం కింద ఏడాదికి రూ.23.76 లక్షల చొప్పున చెల్లించారు. హైస్కూల్‌ యూఎల్‌బీ కో–ఆర్డినేటర్ల పేరిట ఏడాదికి రూ.4.64 కోట్లు, ఎఎఫ్‌సీ ఏవో టీచర్ల హానరోరియం కింద రూ.1.26 కోట్లు, సీఎఫ్‌సీ టీచర్ల హానరోరియం కింద రూ.10.90 లక్షలు, స్పార్క్‌ క్లాసుల కోసం రూ.5.83 కోట్ల నిధులు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపిస్తున్నారు. ఏడాదికి రూ.34.85 కోట్లు చొప్పున మూడేళ్లలో రూ.104.55 కోట్ల మేర నిధులు వెచ్చించారు. ఈ నిధులన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. 

ఎస్‌సీఈఆర్టీ నిబంధనలు బేఖాతర్‌ 
రాష్ట్రంలో మున్సిపల్‌ శాఖ పరిధిలో మున్సిపాల్టీల్లో 2,110 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 300 ఉన్నత పాఠశాలలు, 160 ప్రాథమికోన్నత పాఠశాలల్లో ‘నారాయణ’ తరహా బోధనను ప్రయోగాత్మకంగా చేపట్టారు. వాస్తవానికి మున్సిపల్‌ స్కూళ్లలో నిర్వహణ బాధ్యతల వరకే మున్సిపల్‌ శాఖకు అధికారం ఉంటుంది. అకడమిక్‌ వ్యవహారాలన్నీ విద్యాశాఖ పరిధిలోనే కొనసాగాలి. కానీ, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ మున్సిపల్‌ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మున్సిపల్‌ స్కూళ్ల విషయంలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారు. విద్యా శాఖతో సంబంధం లేకుండానే అకడమిక్‌ వ్యవహారాలను మున్సిపల్‌ శాఖ చేపట్టింది. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్టీ) నిబంధనలతో సంబంధం లేకుండానే మున్సిపల్‌ స్కూళ్లలో నారాయణ తరహా సిలబస్, బోధనను అమల్లోకి తీసుకొచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement