రాజధానిలో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు

Sand Mining In The Capital In Amaravathi - Sakshi

భారీ వాహనాల్లో ఇతర జిల్లాలకు తరలింపు

పట్టించుకోని వివిధ శాఖల అధికారులు

సాక్షి, తాడేపల్లి రూరల్‌(మంగళగిరి): ఇసుక తరలిపోతోంది. కోట్లాది రూపాయల వ్యాపారం సాగుతోంది. నిబంధనలు ఉన్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. రాజధాని ప్రాంతంలో 13 ఇసుక రీచ్‌లు ఉన్నాయి. ఇతర జిల్లాలకు ఇసుక తరలించకూడదంటూ ప్రభుత్వం, మైనింగ్‌శాఖ అధికారులు ఆంక్షలు విధించారు.

ఒకానొక సమయంలో పలుచోట్ల భారీ బందోబస్తు నిర్వహించి, లారీలను సీజ్‌చేసి, వేలరూపాయల అపరాధ రుసుమును విధించారు. పోలీసులు లారీలను వదిలేస్తున్నారంటూ అప్పట్లో మైనింగ్‌శాఖ అధికారులు ఆరోపించారు.దీంతో పోలీసులు ప్రకాశం బ్యారేజీ వద్ద, కనకదుర్గ వారధి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి, అర్ధరాత్రి సమయంలో లారీలను తనిఖీలు చేసి మరీ పంపించారు.

ఓ నెల పాటు ఇలా తనిఖీలు నిర్వహించి, వందలాది లారీలను పట్టుకొని సీజ్‌చేశారు. అనంతరం మరి ఏం జరిగిందో, ఏంటో తెలియదు కానీ రాజధాని ప్రాంతంలోని పెనుమాక, రాయపూడి, ఉద్దండరాయునిపాలెం, తదితర ప్రాంతాల నుంచి నిబంధనలకు విరుద్ధంగా క్వారీ యజమానులు భారీ వాహనాలకు ఇసుక లోడింగ్‌ చేస్తూ జేబులు నింపుకుంటున్నారు.

 
నిబంధనలు అతిక్రమణ ఇలా..
నిబంధనల ప్రకారం పది టైర్ల లారీకి 21 టన్నులు లోడ్‌ చేయాల్సి ఉండగా, 30 నుంచి 40 టన్నులు లోడ్‌ చేస్తూ పక్క జిల్లాలకు, పక్క రాష్ట్రాలకు తరలించేందుకు సహకరిస్తున్నారు. రాత్రి 11 గంటలు దాటితే చాలు 60, 70 కిలోమీటర్ల స్పీడ్‌తో బాడీ లారీలు కాబిన్‌ లెవల్‌ ఇసుక లోడ్‌ వేసుకొని పరుగులు తీస్తున్నాయి.

పోలీసులు ఎక్కడైనా గస్తీ కాస్తుంటే ముందస్తుగానే లారీ డ్రైవర్లకు సమాచారం ఇచ్చేందుకు మూడు కార్లను ఉపయోగించి, కొంతమంది తిరుగుతూ లారీ డ్రైవర్లకు సమాచారం ఇస్తున్నారు. ఎవరైనా అధికారులు కానీ, పోలీసులుకానీ ఉన్నారని తెలిస్తే రాజధాని పరిధిలోని కృష్ణాయపాలెం, యర్రబాలెం చెరువు, మందడం, మందడం బైపాస్‌రోడ్డులో లారీలను గప్‌చుప్‌గా పక్కనపెట్టి అధికారులు వెళ్లిన తర్వాత అక్కడ నుంచి వారి గమ్య స్థానాలకు బయల్దేరుతున్నారు. ప్రతిరోజూ కనకదుర్గ వారధి మీద నుంచి కృష్ణాజిల్లా గుడివాడ, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, చింతలపూడి, జంగారెడ్డిగూడెం తదితర ప్రాంతాలకు భారీగా ఇసుక తరలిపోతుంది.

నిద్రావస్థలో అధికారులు...
రాజధాని పరిధిలోని ఇసుక రీచ్‌ల్లో పట్టపగలే లోడింగ్‌ చేయించుకొని, అర్ధరాత్రి దాటే వరకు లారీలను ఎక్కడో ఒక చోట దాచి పెట్టి, అర్ధరాత్రి దాటిన తరువాత వాటిని రోడ్డెక్కించి జనాలను భయభ్రాంతులను చేస్తూ, అధిక వేగంతో వెళ్తున్న ఇసుక లారీలను పట్టించుకోవడం లేదు. రాజధాని పరిధిలో అధిక లోడ్‌తో తరలివెళ్లే ఇసుక లారీకి మంగళగిరి ఆర్టీఓ పరిధిలో నెలకు రూ.30వేలు తీసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం.

దీనికి మధ్యవర్తిగా మంగళగిరిలో వివిధ వాహనాల దరఖాస్తు చేసే ఓ వ్యక్తి సొమ్ము వసూలు చేసి, వారికి సమర్పిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అంతేకాక మామూలుగా వెళ్లే లారీలు ఒక్కొక్క లారీకి రూ.8వేలు చొప్పున 300 లారీల దగ్గర వసూలు చేస్తున్నారని లారీ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివిధ క్వారీల నుంచి మైనింగ్‌శాఖ అధికారులకు భారీ ముడుపులు అందడం, మరికొన్ని క్వారీలు నేరుగా ఎమ్మెల్యేలు నిర్వహించడంతో వాటి జోలికి వెళ్లకపోవడం వల్లనే రాజధాని ప్రాంతం నుంచి భారీ వాహనాల్లో ఇసుక తరలిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.  

Read latest Amaravati News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top