Photo Credit: X (Twitter)
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. పాకిస్తాన్‌లో ఉగ్రవాదిగా ముద్రపడిన ఉజైర్ బలోచ్‌తో కలిసి అఫ్రిది డిన్నర్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. దీంతో క్రికెట్ అభిమానులు షాహిద్ అఫ్రిదిని ఏకిపారేస్తు న్నారు. జీషన్ అక్రమ్ మీర్జా అనే వ్యక్తి తన ‘ఎక్స్’ వేదికగా ఫొటోలను పంచుకున్నాడు.
2013లో షాహిద్ అఫ్రిది ఒక ప్రైవేటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనట్లు తెలుస్తోంది. అదే కార్యక్రమానికి అప్పటి ల్యారీ గ్యాంగ్ నెట్‌వర్క్‌కు కీలక నాయకుడిగా ఉన్న ఉజైర్ బలోచ్ కూడా వచ్చాడని, ఈ సందర్భంగా ఉజైర్ బలోచ్ గ్యాంగ్‌తో కలిసి అఫ్రిది డిన్నర్‌లో పాల్గొన్నాడంటూ అభిమాని ఫొటోలు తాజాగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
ఇక ల్యారీ గ్యాంగ్‌లో రెహమాన్ డెకాయిట్ తర్వాత రెండో అత్యున్నత పదవిలో కొనసాగిన ఉజైర్ బలోచ్ లక్షిత హత్యలు, దోపిడీలు, ముఠా హింస, మాదకద్రవ్యాల రవాణా, గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొన్నాడు. 2008 ముంబై ఉగ్రదాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదులకు ఆయుధాల సరఫరా చేయడంలో ఉజైర్ బలోచ్ కీలకపాత్ర పోషించాడని ఆరోపణలు ఉన్నాయి. 2016లో పాకిస్తాన్ ప్రభుత్వం ఉజైర్ బలోచ్‌ను అదుపులోకి తీసుకొని దేశంలో అత్యంత కరుడుగట్టిన నేరస్థులలో ఒకడిగా ముద్ర వేశారు.
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ చిత్రం ధురందర్‌లో ఉజైర్ బలోచ్ అనే పాత్రను భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదానికి సహకరించిన గ్యాంగ్‌స్టర్‌గా చూపించారు. అయితే తాజాగా షాహిద్ అఫ్రిది ఉగ్రవాదిగా ముద్రపడిన ఉజైర్ బలోచ్‌తో డిన్నర్‌లో పాల్గొన్న ఫొటోలు ప్రత్యక్షమవ్వడం వివాదానికి దారి తీసింది. పాక్ వ్యక్తులే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారనడానికి ఇంతకంటే సాక్ష్యాలు ఏం కావాలి అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
నిజానికి మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది తన ప్రవర్తనతో ఎన్నోసార్లు అప్రతిష్ట పాలయ్యాడు. ఆటలో నైపుణ్యం సంగతి పక్కనబెడితే అతడు భారత్ వ్యతిరేకిగా ముద్రపడ్డాడు. ఈ పాక్ మాజీ కెప్టెన్ పదే పదే భారత్ సంస్కృతికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి ఉగ్రవాదాన్ని సమర్థించి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నాడు.
బయట వివాదాలు ఎన్ని ఉన్నా ఆటలో మాత్రం షాహిద్ అఫ్రిది నిఖార్సైన ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు. పాక్ తరఫున అఫ్రిది 27 టెస్టులు, 398 వన్డేలు, 99 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా శతకం బాదిన తొలి బ్యాటర్‌గా (37 బంతుల్లో) అఫ్రిది ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 2018లో అఫ్రిది అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు.
Shahid Afridi and Uzair Baloch of PAC aka Lyari Gang pic.twitter.com/IxSg0rUPEM
— Zeeshan Akram Mirza (@ZshanMirza) March 27, 2013


