ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ వైఫల్యాల పరంపర కొనసాగుతుంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ఆ జట్టు.. తాజాగా మరో ఓటమిని మూటగట్టుకొని పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. ముంబై ఘోర ప్రదర్శనలకు ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యానే ప్రధాన కారణమని అభిమానులు దుమ్మెత్తిపోస్తున్న వేళ.. హార్దిక్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది.
నిన్న (మే 20) కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓవరాక్షన్ చేసినందుకు బీసీసీఐ అతన్ని శిక్షించింది. ముంబై బౌలింగ్ సమయంలో (ఇన్నింగ్స్‌లో 10వ ఓవర్) హార్దిక్ కోపంతో స్టంప్స్‌పై ఉన్న బెయిల్స్‌ను బలంగా కొట్టాడు. ఈ చర్యను ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘనగా పరిగణించిన మ్యాచ్ రిఫరీ రాజీవ్ సేథ్.. హార్దిక్‌పై జరిమానా విధించారు.
ఈ ఘటనపై ఐపీఎల్ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. "హార్దిక్ పాండ్యా ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.2ను ఉల్లంఘించాడు. మ్యాచ్ సమయంలో క్రికెట్ పరికరాలు లేదా మైదాన ఉపకరణాలను దుర్వినియోగం చేయడం ఈ నిబంధనకు సంబంధించింది" అని వెల్లడించింది. ఈ తప్పిదానికి గానూ జరిమానాతో (10 శాతం మ్యాచ్‌లో ఫీజ్) పాటు ఒక డిమెరిట్ పాయింట్ కూడా హార్దిక్ ఖాతాలో చేరింది.
కాగా, హార్దిక్ ఈ సీజన్‌లో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఫామ్ లేమితో పాటు ఫిట్‌నెస్ సమస్యలతోనూ ఇబ్బంది పడ్డాడు. వెన్ను నొప్పి కారణంగా వరుసగా మూడు మ్యాచ్‌లకు దూరమైన అతడు.. తాజాగా కేకేఆర్ మ్యాచ్‌తో మళ్లీ జట్టులోకి వచ్చాడు. అయితే ఈ మ్యాచ్‌లో కూడా ముంబైకి ఓటమి తప్పలేదు.
వర్షం అంతరాయం కలిగించిన ఆ మ్యాచ్‌లో ముంబై తొలుత బ్యాటింగ్ చేసి 8 వికెట్ల నష్టానికి 147 పరుగులకు పరిమితమైంది. అనంతరం స్వల్ప టార్గెట్‌ను కాపాడుకునే క్రమంలో బౌలర్లు చేతులెత్తేశారు. హార్దిక్ రెండు ఓవర్లలో కేవలం 13 పరుగులే ఇచ్చినా వికెట్ మాత్రం తీయలేకపోయాడు. ఇదే సమయంలో అతడి అసహనం బయటపడింది. అందుకే అతడు స్టంప్స్‌పై ఉన్న బెయిల్స్‌ను బలంగా కొట్టాడు.
అంతిమంగా కేకేఆర్ 18.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మనీశ్ పాండే (45), రోవ్‌మన్ పావెల్ (40) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి కేకేఆర్‌ను గెలిపించారు. ఈ గెలుపుతో కేకేఆర్ ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.


