Photo Courtesy: IPL 2026
ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ నిలకడ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 14 మ్యాచ్‌లాడిన సాయి సుదర్శన్ 157 స్ట్రైక్‌రేట్‌తో 638 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులో లీడింగ్‌లో కొనసాగుతున్నాడు. అయితే సాయి సుదర్శన్ ప్రదర్శన బాగానే ఉన్నప్పటికీ బ్యాటింగ్‌లో ఇంకా దూకుడు పెంచాల్సిన అవసరముందని టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చురకలు అంటించాడు.
ఐపీఎల్లో స్థిరమైన ప్రదర్శన కొనసాగిస్తున్నప్పటికీ ఆఖరి ఓవర్లలో వేగంగా పరుగులు రాబట్టడంలో సాయి సుదర్శన్ విఫలమవుతున్నాడని తెలిపాడు. అశ్విన్ మాట్లాడుతూ..'నేను శుబ్‌మన్ గిల్ బ్యాటింగ్‌ను ప్రశంసించాలనుకుంటున్నా. గుజరాత్ టైటా న్స్ను అటు కెప్టెన్‌గా సమర్థంగా నడిపిస్తూనే బ్యాటర్‌గా రాణిస్తున్నాడు.
ముఖ్యంగా పవర్‌ప్లేలో గిల్ పట్టుదలతో భారీ ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. కానీ సాయి సుదర్శన్ ప్రదర్శన మెచ్చుకునే రీతిలో ఉన్నప్పటికీ మోడ్రన్ టీ20 క్రికెట్‌కు సరిపోయేలా అతడు ఆడడం లేదు. సాయి సుదర్శన్ ఎక్కువగా సంప్రదాయబద్ధంగానే క్రికెట్ ఆడతాడు, కానీ ఇన్నింగ్స్ చివర్లో వేగంగా ఆడలేకపోతున్నాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లలో బ్యాటింగ్‌లో వేగం పెంచితే మాత్రం సాయి సుదర్శన్‌కు తిరుగుండకపోవచ్చు.
ఆరెంజ్ క్యాప్‌లో లీడింగ్‌లో ఉన్నప్పటికీ సాయి సుదర్శన్ తన ప్రదర్శనను చాలా మెరుగుపరుచుకోవాల్సి ఉంది. అతడు దీనిని చేయగలడని ఆశిస్తున్నా. ఇక గిల్ బాగా ఆడుతున్నప్పటికీ తనలోని పూర్తి సామర్థ్యాన్ని వెలికి తీయలేదని నాకు అనిపిస్తోంది.' అంటూ చెప్పుకొచ్చాడు.
గురువారం సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 89 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (84), కెప్టెన్ గిల్ (64) అర్థశతకాలతో రాణించారు. జాస్ బట్లర్ (57 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్‌కింగ్స్ 13.4 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది. శివమ్ దూబే (47) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. మ్యాచ్‌లో ఓటమితో సీఎస్కే టోర్నీ నుంచి నిష్క్రమించింది.


