పాకిస్తాన్ హాకీ జట్టు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ హాకీ ఫెడరేషన్ (పీహెచ్ఎఫ్) నుంచి రావాల్సిన పెండింగ్ బకాయిలు రాకపోగా తాజాగా మరో బాంబు పేల్చింది. రోజువారీ శిక్షణా శిబిర భత్యం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్లకు శిక్షణా భత్యం కింద ఇస్తున్న 11 డాలర్లను(రూ. 3 వేలు) 3.5 డాలర్లకు (రూ. 335) తగ్గించడం గమనార్హం.
దీంతో పాక్ ఆటగాళ్లు శిక్షణా శిబిరం భత్యం కింద ఇకపై కేవలం 335 రూపాయలు మాత్రమే అందుకోనున్నారు. ఇదే విషయమై పాక్ ఆటగాళ్లు తమకు న్యాయం చేయాలంటూ పీహెచ్ఎఫ్కు ఫిర్యాదు చేశారు. ‘ఈజిప్టులో మేము ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీ ఆడుతున్న సమయంలోనే విదేశీ పర్యటనలకు మాకు రోజువారీ భత్యం 110 డాలర్లు ఇస్తామని వారు ప్రకటించారు. కానీ ఆ మొత్తం ఇప్పటివరకు మాకు అందలేదు.
ఇప్పుడు శిక్షణా శిబిరం భత్యానికి సంబంధించి ఇచ్చే మొత్తాన్ని రూ.335కు కుదించడం దారుణం. దీనివల్ల మాకు ఒరిగేదేమిలేదు. ఆర్థిక నష్టాల పేరుతో మాకు వచ్చే అరకొర డబ్బులను కూడా ఇలా కుదింపు పేరుతో లాగేసుకోవడం దుశ్చర్య కిందకు వస్తుంది. తక్షణమే మాకు న్యాయం చేయాలి’ అని ఆటగాళ్లు పాకిస్తాన్ హాకీ సమాఖ్యకు ఫిర్యాదు చేశారు.
ఈ ఏడాది ఆగస్టులో నెదర్లాండ్స్, బెల్జియం వేదికగా హాకీ ప్రపంచకప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 20 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించినప్పటికీ, కెప్టెన్ ఎవరన్న దానిపై మాత్రం ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. గతేడాది నుంచి పాకిస్తాన్ హాకీ జట్టును షకీల్ అమ్మాద్ బట్ నడిపిస్తున్నాడు.
ఎఫ్ఐహెచ్ ప్రొ మూడో దశ జూన్ 13 నుంచి 27 వరకు జరగనుంది. ఇందులో పాకిస్తాన్ బెల్జియం, స్పెయిన్, ఇంగ్లండ్‌తో పాటు చిరకాల ప్రత్యర్థి భారత్‌తోనూ తలపడనుంది. ఈ టోర్నీ ముగిసిన వెంటనే పాకిస్తాన్ హాకీ ప్రపంచకప్ ఆడనుంది.


