తెలంగాణ వాదులను గుండెల్లో పెట్టుకుంటా | NRI: Former Minister BRS MLA T Harish Rao in new york | Sakshi
Sakshi News home page

తెలంగాణ వాదులను గుండెల్లో పెట్టుకుంటా

May 21 2026 11:18 AM | Updated on May 21 2026 11:50 AM

NRI: Former Minister BRS MLA T Harish Rao in new york

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పట్టుబట్టి పనిచేసిన తెలంగాణవాదులను గుర్తించి గుండెల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ నాయకుడు, ఎల్పీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు అన్నారు. వ్యక్తిగత పర్యటనలో భాగంగా అమెరికాలో ఉన్న ఆయన న్యూయార్క్ లో తెలంగాణవాదుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. లాంగ్ ఐలాండ్ లో ప్రముఖ ఎన్ఆర్ఐ లక్ష్మణ్ ఏనుగు నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంతంలో నివసిస్తున్న తెలంగాణ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రముఖ ఎన్నారై వ్యాపారవేత్త డాక్టర్ పైళ్ళ మల్లారెడ్డిని హరీష్ రావు ప్రత్యేకంగా ప్రశంసించారు. అమెరికాలో స్థిరపడి తెలుగు వారికి ఉద్యోగ ఉపాధి రంగాల్లో ఆయన అందిస్తున్న సహకారం గొప్పగా ఉందని అన్నారు.

ఉద్యమకాలం నుంచి, ఆ తర్వాత కూడా తెలంగాణే లక్ష్యంగా చాలా మంది ఎన్ఆర్ఐలు పనిచేశారని హరీష్ రావు గుర్తుచేసుకున్నారు. తమకు అనేక పరిమితులు ఉన్నా లక్మణ్ ఏనుగు లాంటి సోదరులు అనేకమంది తెలంగాణ ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్నారని, తమ సమయంతో పాటు ఆర్థిక వనరులను కూడా వెచ్చించారని అన్నారు.

పలువురు ఎన్ఆర్ఐలు మాట్లాడుతూ ముందు నుంచీ తాము పార్టీకి అండగా ఉన్నామని, తెలంగాణ భావజాలవ్యాప్తికి అన్నిరకాలుగా కృషి చేశామని తెలిపారు. ఉద్యమవాదుల్లో కొందరికి అన్యాయం జరిగిందని, మరికొందరిలో అసంతృప్తి గూడు కట్టుకొన్న విషయాన్ని హరీష్ రావుకు దృష్టికి తీసుకువచ్చారు.  మరోసారి తెలంగాణవాదుల పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉందని, తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీలేని పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ కు అండగా నిలవాలని అమెరికా ఎన్ఆర్ఐలకు పిలుపునిచ్చారు.

తెలంగాణ సాధనలో భూమి పుత్రుడైన లక్ష్మణ్ ఏనుగు రాజీలేని పోరాటం చేశారని, పదహారు ఏళ్ల కిందటే ధూమ్ ధామ్ లు నిర్వహించటంతో పాటు, అనేక మంది ప్రముఖ నాయకులు, తెలంగాణ కవులు కళాకారులను అమెరికాకు పరిచయం చేసిన ఘనత లక్ష్మణ్ కు దక్కిందని హరీష్ రావు ప్రశంసించారు. 

ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఎన్ఆర్ఐలు డాక్టర్ రాజేందర్ రెడ్డి జిన్నా, శ్రీనివాస్ గూడూరు, సతీష్ కల్వ, సహోధర్ రెడ్డి, రవీందర్ కోడెల, హరిచరణ్ బొబ్బిలి, మల్లిక్ రెడ్డి, రమా వనమా, వాణి ఏనుగు, ఉషా మన్నెం, రంజీత్ క్యాతం, అమర్ లింగాల, సునీల్ మన్నెం, తన్నీరు మహేష్, నరసింహారావు, చందు తళ్ల, తిరుపతిరెడ్డి, శ్రీనివాస్ జక్కిడి, తదితరులు పాల్గొన్నారు.

(చదవండి: ఘనంగా TAL ప్రీమియర్ లీగ్ ఆరంభం)

Advertisement
 
Advertisement
Advertisement