తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ సి విజయ్ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు హాట్ చర్చకు దారి తీసింది. గత ప్రభుత్వ హయాంలో అరెస్టై జైల్లో ఉన్న ప్రముఖ యూట్యూబర్ ‘సావుక్కు’ శంకర్‌ను తక్షణమే విడుదల చేయాలని ఆయన ఆదేశించారు. శంకర్‌పై గూండా యాక్ట్‌ను ఎత్తేయాలని పోలీస్‌శాఖను ఆదేశించారు. దీంతో ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
సావుక్కు శంకర్(Savukku Shankar) అనే పేరు తమిళనాడులో రాజకీయాలు, మీడియా, ప్రజాస్వామ్య చర్చల్లోనూ తరచూ వినిపిస్తుంటుంది. సావుక్కు అంటే కొరడా అని అర్థం. విజిల్‌బ్లోయర్‌గా, సిస్టమ్‌కి బలైన వ్యక్తిగా ఆయన అక్కడి జనాలు భావిస్తుంటారు. అదే సమయంలో ఆయన నోటి దురుసును విమర్శించేవాళ్లు లేకపోలేదు. ఆయన ట్రాక్ రికార్డు చెప్పాలంటే.. గత ఐదేళ్ల కాలంలో ఏకంగా తొమ్మిదిసార్లు అరెస్ట్ అయ్యారు ఆయన.
ఎవరీ సావుక్కు శంకర్..
ఆచిముత్తు శంకర్ మాజీ ప్రభుత్వ ఉద్యోగి. విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ విభాగంలో క్లర్క్‌గా పని చేశారు. అయితే 2008లో తమిళనాట సంచలనం సృష్టించిన ఆడియో లీక్ కేసులో సస్పెండ్ అయ్యి.. దర్యాప్తు తదనంతరం ఉద్యోగం పొగొట్టుకున్నారు. ఆ స్కాంలో ఓ మంత్రి కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. కొంతకాలం అజ్ఞాతంలో ఉన్న ఆయన.. ఆపై సావుక్కు అనే వెబ్‌సైట్, యూట్యూబ్ చానెళ్ల ద్వారా ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేశారు.
అవినీతి, అధికార దుర్వినియోగం బయటపెట్టిన వ్యక్తిగా ఆయనకంటూ తమిళనాట ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. కాలక్రమంలో ఆయన నోటి నుంచి నిజాలే వస్తాయని జనం భావించేంతగా పరిస్థితి చేరుకుంది. దీంతో వ్యవస్థ నుంచి ఆయనకు ఇబ్బందులు ఎదురయ్యాయి.

డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ పార్టీలపై ఆయన చేసిన విమర్శలు, న్యాయవ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు.. ప్రజల్లో ఒక వర్గానికి ఆయనను ధైర్యవంతుడిగా చూపించాయి. అవినీతి వ్యతిరేకంగా పోరాడే యువత, ప్రభుత్వంపై అసంతృప్తి ఉన్నవారు ఈయనకు మద్దతుగా నిలిచేవారు. అదే సమయంలో.. మహిళలపై నోరు పారేసుకోవడం, వ్యక్తిగత దాడులు ఆయనపై కాస్త నెగెటివిటీని క్రియేట్ చేశాయి.
డీఎంకే హయాంలో..
2021లో స్టాలిన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శంకర్‌పై వరుసగా కేసులు నమోదయ్యాయి. గూండాస్ యాక్ట్ కింద పలుమార్లు అరెస్టు కావడం, ఎన్డీపీఎస్ కేసులు ఎదుర్కొన్నప్పటికీ, కోర్టులు మాత్రం ఆయన్ని నిర్దోషిగా తీర్పునిస్తూ డీఎంకే ప్రభుత్వానికి మొట్టికాయలు వేసేవి. అంతెందుకు 2024లో, మద్రాస్ హైకోర్టు ఆయనపై ఉన్న ఓ సంబంధించి నిర్బంధాల్ని రద్దు చేసింది. దీంతో.. డీఎంకే ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, ఆయన్ని అన్యాయంగా ఇబ్బంది పెడుతున్నారని తమిళ ప్రజలు భావించేవారు. ‘‘తప్పుడు కేసులతో స్టాలిన్ ప్రభుత్వం నా నోరు మూయించే ప్రయత్నం చేస్తోంది’’ అంటూ స్వయంగా ఆయన కూడా ఆరోపించేవారు. ఈ ఏడాది పరువు నష్టం కేసులోనూ మద్రాస్ హైకోర్టు ఆయనకు బెయిల్ కూడా ఇచ్చింది. ఇదిలా ఉండగానే..
2026 ఏప్రిల్‌లో చెన్నై పోలీసులు గూండాస్ చట్టం కింద నిర్బంధం విధించారు. ఏపీలో అరెస్ట్ చేసి చెన్నైకి తీసుకువచ్చే సమయంలో పోలీసులపై రాళ్లు విసిరారని కేసు పెట్టారు. అయితే ఈ కేసులో ఆయన నిర్దోషి అని విజయ్ ప్రభుత్వం గుర్తించింది. అడ్వైజరీ బోర్డు పరిశీలనలో ఆయన నిర్బంధానికి తగిన కారణం లేదని తేలడంతో విడుదల చేయాలని ఆదేశించింది. ఆయనపై ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి. వాటిలో చిక్కులను పరిశీలించాక ఆయన్ని విడుదల చేయాలని పోలీసు శాఖకు తమిళనాడు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఇక్కడో విషయం ఏంటంటే..
సావుక్కు శంకర్ విజయ్‌నూ వదల్లేదు. కరూర్ తొక్కిసలాట ఘటనలో టీవీకే అధినేత తీరును ఏకిపారేస్తూ వీడియో సిరీస్ తీశాడు. వాటికి విపరీతంగా ఆదరణ దక్కింది.


