పుల్వామా ఉగ్రదాడి మాస్టర్‌మైండ్ 'హంజా బుర్హాన్' హతం! | Pulwama attack mastermind Hamza Burhan killed by unknown gunmen in POK | Sakshi
Sakshi News home page

పుల్వామా ఉగ్రదాడి మాస్టర్‌మైండ్ 'హంజా బుర్హాన్' హతం!

May 21 2026 5:27 PM | Updated on May 21 2026 6:13 PM

Pulwama attack mastermind Hamza Burhan killed by unknown gunmen in POK

సాక్షి, న్యూఢిల్లీ:  2019 నాటి ఘోరమైన పుల్వామా ఉగ్రదాడిలో కీలక నిందితుడైన ఉగ్రవాది హంజా బుర్హాన్ (Hamza Burhan) గుర్తుతెలియని దుండగుల చేతిలో హతయ్యాడు.  40 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్ల ప్రాణాలను బలిగొన్న ఈ దాడిలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిని పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని ముజఫరాబాద్‌లో  దుండగులు కాల్చి చంపారు. ఇటీవలి కాలంలో పాకిస్తాన్, PoKలలో ఆశ్రయం పొందుతున్న భారత వ్యతిరేక ఉగ్రవాదుల రహస్య హత్యలు చర్చనీయాంశంగా మారింది.

పుల్వామా నుండి పాకిస్థాన్‌కు
బుర్హాన్ జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని ఖర్బత్‌పోరా ప్రాంతానికి చెందినవాడు. 2017లో, అతను ఉన్నత విద్యను అభ్యసించే నెపంతో పాకిస్థాన్‌లోకి ప్రవేశించినట్లు సమాచారం. అయితే, అతను నిషేధిత ఉగ్రవాద సంస్థ 'అల్-బదర్' (Al-Badr)లో చేరినట్లు నిఘా వర్గాల రికార్డులు తరువాత వెల్లడించాయి. ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ  కాలక్రమేణా కమాండర్ స్థాయికి ఎదిగాడు. కాశ్మీర్‌లో భారత వ్యతిరేక కార్యకలాపాలకు ప్లాన్ చేయడం, స్థానిక యువతను ఉగ్రవాదం వైపు రిక్రూట్ చేయడంలో ఇతడు కీలక పాత్ర పోషించాడు. భారత కేంద్ర హోంశాఖ (MHA) ఇతడి ఉగ్రవాద కార్యకలాపాలను పరిగణనలోకి తీసుకుని, 2022లో దేశ వ్యతిరేక చట్టాల కింద ఇతడిని అధికారికంగా 'ఉగ్రవాది'గా ప్రకటించింది.

ఇదీ చదవండి: భర్తను హత్య చేసిన భార్యకు కేవలం రూ. 500 ఫైన్‌, ఎందుకలా?

పుల్వామా దాడి 
హంజా బుర్హాన్ హత్యతో  2019 ఫిబ్రవరిలో దేశాన్ని కుదిపేసిన పుల్వామా ఉగ్రదాడి జ్ఞాపకాలు మరోసారి తెరపైకి వచ్చాయి.  పుల్వామా జిల్లాలోని లెత్‌పోరా వద్ద జైష్-ఎ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఆత్మాహుతి బాంబర్, పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో సీఆర్‌పీఎఫ్ (CRPF) కాన్వాయ్‌ను ఢీకొట్టాడు. ఈ   ఉగ్ర దాడిలో 40 మందికి పైగా సీఆర్‌పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. ఈ దాడి భారతదేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీయడమే కాకుండా భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలను పెంచింది.

బాలాకోట్‌ మెరుపు దాడులు 
పుల్వామా దాడికి ప్రతిస్పందనగా, కొన్ని రోజుల తర్వాత భారత వైమానిక దళం పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు చేసింది. ఈ ఆపరేషన్ అణ్వాయుధాలు కలిగిన ఈ రెండు పొరుగు దేశాల మధ్య ఉద్రిక్తతలను తీవ్రతరం చేయడంతో పాటు, సరిహద్దు వెంబడి సైనిక ఉద్రిక్తతలను కూడా పెంచింది. 

ఇదీ చదవండి: 60 రోజుల్లో ఉద్యోగం : లేదంటే కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌

గత కొన్ని ఏళ్లుగా పాకిస్తాన్‌లో తలదాచుకుంటున్న మోస్ట్ వాంటెడ్ భారత వ్యతిరేక ఉగ్రవాదులు వరుసగా గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హతమవుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో పుల్వామా నిందితుడు హంజా బుర్హాన్ కూడా చేరాడు. ఈ తాజా కాల్పులపై అధికారికంగా ఎలాంటి ప్రకటనలు రానప్పటికీ, సరిహద్దుకు ఆవలి వైపు నుండి పనిచేస్తున్న భారత్ వ్యతిరేక మిలిటెంట్ గ్రూపులు, భద్రతపై  చర్చను రాజేసే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: బిడ్డల్ని వదిలేసి, డబ్బు, స్కూటర్‌ తీసుకొని ప్రియుడితో పరార్‌

 

Advertisement
 
Advertisement
Advertisement