‘హీరా గోల్డ్‌’ నౌహీరా షేక్‌ అరెస్ట్‌ | ED Arrests Nouheera Shaik In 5,600 Crore Heera Gold Group Scam Case, More Details Inside | Sakshi
Sakshi News home page

‘హీరా గోల్డ్‌’ నౌహీరా షేక్‌ అరెస్ట్‌

May 22 2026 8:13 AM | Updated on May 22 2026 11:27 AM

ED Arrest By Heera gold Nowhera shaik

ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘హీరా గోల్డ్‌’ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. హీరా గ్రూప్‌ నౌహీరా షేక్‌ను ఈడీ అరెస్ట్‌ చేసింది. గుర్గావ్‌ సమీపంలో నౌహీరా షేక్‌ను ఈడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. నౌహీరా షేక్‌.. ఫేక్‌ ఆధారాలతో గుర్గావ్‌లో ఉన్నట్టు ఈడీ అధికారులు గుర్తించారు. దీంతో, ఆమెను అరెస్ట్‌ చేసి హైదరాబాద్‌కు తరలించనున్నట్టు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే నౌహీరా షేక్‌ బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు.. బాధితులకు డబ్బులు చెల్లించకుండా నౌహీరా షేక్‌ ఇబ్బందులకు గురిచేస్తోంది.

కేసు వివరాలు ఇలా.. దేశవ్యాప్తంగా ‘హీరా గోల్డ్‌’ కుంభకోణం సంచలనం సృష్టించింది. వివిధ రాష్ట్రాల్లోని దాదాపు 1.72 లక్షల మంది నుంచి అక్రమంగా రూ.5,600 కోట్ల డిపాజిట్లు సేకరించినట్టు ఆ సంస్థ ఎండీ నౌహీరా షేక్‌ ఆరోపణలు ఎదుర్కొంది. తమ సంస్థలో పెట్టుబడులు పెడితే ఏడాదికి 36 శాతం లాభాలు వస్తాయని నమ్మించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకతోపాటు ఇతర రాష్ట్రాల్లోని ప్రజలను మోసం చేశారన్న ఫిర్యాదులపై నౌహీరా షేక్‌పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన ఈడీ అధికారులు లక్షలాది మంది డిపాజిటర్ల నుంచి రూ.వేల కోట్లు కాజేసిన నౌహీరా వాటిని విదేశాలకు మళ్లించేందుకు సమకూర్చుకున్న పలు పత్రాలు, డిజిటల్‌ ఆధారాలు సోదాల్లో స్వాధీనం చేసుకున్నారు. నౌహీరాతోపాటు ఆమె కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లతో ఉన్న రూ.45 కోట్ల విలువైన 13 ఆస్తుల పత్రాలు, బినామీల పేరిట ఉన్న రూ.25 కోట్ల విలువైన 11 ఆస్తుల పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ.వేల కోట్ల నిధుల గోల్‌మాల్‌ కేసులో ఈడీ ఇప్పటికే నౌహీరా షేక్‌కు సంబంధించిన సుమారు రూ.400 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు అటాచ్‌ చేసింది. ఈ నేపథ్యంలో నౌహీరా షేక్‌ ఆస్తులను ఈడీ వేలం వేస్తుంది.

ఈ నేపథ్యంలో నౌహీరా షేక్‌కు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో, 5 షరతులతో నౌహీరా షేక్‌కు బెయిల్‌ మంజూరు చేసింది. ఆ షరతుల్లో దేన్ని అతిక్రమించినా బెయిల్‌ రద్దవుతుందని అప్పట్లోనే స్పష్టం చేసింది. కానీ, ఆమె ఆ షరతులను ఉల్లంఘించడంతో బెయిల్‌ను రద్దు చేసింది.

ప్రధాన ఆరోపణలు

  • “హలాల్ ఇన్వెస్ట్‌మెంట్” పేరుతో డిపాజిట్లు సేకరణ

  • నెలకు భారీ రాబడులు ఇస్తామని హామీలు

  • 2018 తర్వాత చెల్లింపులు ఆగిపోవడం

  • వేల కోట్ల రూపాయల మోసం ఆరోపణలు

  • మనీ లాండరింగ్ కేసులు
     

Advertisement
 
Advertisement
Advertisement