ఎన్టీఆర్ 'డ్రాగన్' గ్లింప్స్ వచ్చింది. అభిమానులకు నచ్చేయగా సాధారణ ప్రేక్షకులకు మాత్రం సరైన యాక్షన్ ఏదో మిస్ అయిందే అని ఫీలింగ్ కలిగింది. సోషల్ మీడియాలో దీని గురించి డిస్కషన్ కూడా నడుస్తోంది. వచ్చే ఏడాది జూన్ 11న థియేటర్లలోకి రాబోతున్న ఈ మూవీ సంగతుల్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పుడు పంచుకున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన ఇంటర్వ్యూలో బోలెడన్ని విశేషాలు బయటపెట్టాడు.
(ఇదీ చదవండి: జూ.ఎన్టీఆర్ ఆస్తి ఎంత? ఖరీదైన కార్ల కలెక్షన్ ఏంటి?)
'ఐదేళ్ల క్రితమే ఈ మూవీకి సంబంధించిన కోర్ ఐడియాని ఎన్టీఆర్‌కి చెప్పా. అయితే 'ఆ క్యారెక్టర్ చేసే విపరీతమైన పనుల వెనక పక్కా కారణం, బలమైన డ్రామా ఉందా?' అని నన్ను అడిగారు. దీంతో ఆ పాత్ర ప్రవర్తన, అది చేసే పనులు జస్టిఫై చేయడానికి.. దాని వెనకున్న బలమైన కారణాన్ని స్క్రీన్ ప్లేలోకి తీసుకురావడానికి నాకు, నా టీమ్‌కి మూడేళ్లు పట్టింది. ఇదంతా సిద్ధమైన తర్వాత.. నేను రెడీ అని తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో కేవలం యాక్షన్ మాత్రమే కాదు విపరీతమైన ఎమోషనల్ డ్రామా ఉంటుంది. ఇంతటి స్టార్డమ్ ఉన్న ఓ హీరో, ఇలాంటి పాత్రలో నటించేందుకు ఒప్పుకోవడం చాలా కఠిన నిర్ణయం. సినిమా పూర్తయ్యేసరికి ప్రేక్షకులకు ఆ విషయం అర్థమవుతుంది'
'ఇది చాలా డార్క్ క్యారెక్టర్. ఇప్పటివరకు నేను రాసిన అన్ని పాత్రల కంటే అత్యంత క్రూరంగా ఉంటుంది. నా ట్రయాలజీ(కేజీఎఫ్, సలార్)లో.. ఈ జానర్లో 'డ్రాగన్' చివరి సినిమా. ఈ మూడు ఒకేలా కనిపించడానికి కలర్ కారణం. కానీ మూడు వేర్వేరు స్టోరీలు. దీని తర్వాత కలర్‌ఫుల్ మూవీస్ చేస్తా. మైథాలజీ ఆధారంగా ఓ కథ రాశాను. ప్రస్తుతం ఒప్పుకొన్న ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత దాన్ని సినిమాగా తీస్తాను. 'డ్రాగన్' ద్వారా అతిపెద్ద దేశభక్తి సినిమాని అందించబోతున్నాను' అని ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చారు.
డ్రాగన్.. దేశభక్తి సినిమా అని ప్రశాంత్ నీల్ అనగానే ఎదురుగా ఉన్న యాంకర్ కూడా షాకయ్యారు. అసలు ఈ సమాధానం ఊహించలేదని చెప్పుకొచ్చారు. మరి డైరెక్టర్ చెప్పినట్లు ఎలాంటి దేశభక్తి చూపిస్తారో తెలియాలంటే వచ్చే ఏడాది జూన్ వరకు ఆగాల్సిందే. ఇందులో ఎన్టీఆర్‌తో పాటు అనిల్ కపూర్, బిజు మేనన్, ఖుష్బూ, రుక్మిణి వసంత్, అశుతోష్ రానా, అన్షుమాన్ కపూర్, సిద్ధాంత్ గుప్తా తదితరులు ప్రధాన పాత్రలు చేస్తున్నారు.
(ఇదీ చదవండి: ఎన్టీఆర్ 'డ్రాగన్'లో ఎనిమిది మంది విలన్స్.. ఎవరు వీళ్లంతా?)


