జ్యోతిక సౌత్‌లో స్టార్ హీరోయిన్ అవడానికి ముందు బాలీవుడ్‌లో ట్రై చేసింది. డోలి సజాకే రఖ్నా (1998) చిత్రంతో వెండితెరపై కథానాయికగా పరిచయమైంది. అక్షయ్ ఖన్నా హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయింది. తొలి సినిమాయే కలిసిరాకపోవడంతో బాలీవుడ్ తనకు మరో అవకాశమివ్వకుండా తలుపులు మూసేసింది. దాంతో తమిళంలో ట్రై చేసింది. తమిళ, కన్నడ, తెలుగు భాషల్లో వరుస సినిమాలు చేస్తూ తక్కువకాలంలోనే స్టార్ హీరోయిన్‌గా రాణించింది.
ప్రేమ- పెళ్లి
అయితే కెరీర్ ప్రారంభంలోనే ప్రేమలో పడింది జ్యోతిక. 'పూవెల్లం కెట్టుప్పార్' సినిమాలో సూర్యతో కలిసి నటించగా.. ఆ పరిచయం ప్రేమకు దారి తీసింది. ఆ తర్వాత వీరు జంటగా నాలుగు సినిమాల్లో యాక్ట్ చేయగా ఆ ప్రేమబంధం మరింత బలపడింది. 2006 సెప్టెంబర్ 11న తమ ప్రేమను వైవాహిక బంధంతో పదిలపర్చుకున్నారు. ఈ జంటకు కూతురు దియా, కుమారుడు దేవ్ సంతానం.
ఆదరించని బాలీవుడ్
పెళ్లయ్యాక కొంత గ్యాప్ తీసుకున్న ఈ హీరోయిన్ తర్వాత సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చింది. కానీ, ఈసారి బాలీవుడ్ నుంచే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. అప్పుడు పొమ్మన్న బాలీవుడే ఈసారి రారమ్మని ఎర్ర తివాచీ పరుస్తోంది. దీని గురించి జ్యోతిక మాట్లాడుతూ.. నా ఫస్ట్ హిందీ చిత్రం ఆడనందుకు బాలీవుడ్ నా ముఖంపైనే తలుపేసింది. తమిళంలో కూడా నా మొదటి సినిమా ఆడలేదు. కానీ ఇక్కడ నా పనితనాన్ని మెచ్చి వరుస అవకాశాలిచ్చారు. అదే అక్కడికీ, ఇక్కడికీ తేడా!
అదే ప్లస్, మైనస్
అయితే అప్పటికీ, ఇప్పటికీ బాలీవుడ్‌లో చాలా మార్పు వచ్చింది. మహిళల కోసం ప్రత్యేకంగా కథలు రాస్తున్నారు. దక్షిణాదిలో ఇంకా ఆ దిశగా పెద్దగా ప్రయత్నాలు చేయడం లేదు. ఈ లెక్కన ప్రతి ఇండస్ట్రీలో ప్లస్సులు, మైనస్సులు ఉన్నాయి అంది. కాగా జ్యోతిక నటించిన సిస్టమ్ సినిమా మే 22న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది.


