పుతిన్ పర్యటనతో చమురు సంక్షోభం తీరుతుందా..? | putin to visit delhi in september for brics summit | Sakshi
Sakshi News home page

పుతిన్ పర్యటనతో చమురు సంక్షోభం తీరుతుందా..?

May 20 2026 3:01 PM | Updated on May 20 2026 4:39 PM

 putin to visit delhi in september for brics summit

మాస్కో: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఈ ఏడాది భారత్‌లో పర్యటించనున్నారు. బ్రిక్స్ సదస్సుకు హాజరుకావడానికి ఆయన భారత్ వస్తున్నప్పటికీ ఈ పర్యటనలో పలు కీలకమైన ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా చమురు సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో పుతిన్ భారత్‌ పర్యటన ఎంతో కీలకం కానుంది.

ప్రస్తుతం మిడిల్‌ఈస్ట్‌లో యుద్ధపరిస్థితుల నేపథ్యంలో క్రూడాయిల్‌ ధరలు విపరీతంగా పెరిగాయి.  గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 నుంచి 110 డాలర్ల పైమాటకు చేరి తీవ్రంగా హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి. దీనికి తోడు హర్ముజ్‌ను మూసివేయడంతో చమరు రవాణా దెబ్బతిని తీవ్ర సంక్షోభం ఏర్పడింది. ఈ నేపథ్యంలో భారత్‌లో సైతం పెట్రో డీజిల్‌ ధరలు పెద్ద ఎత్తున పెరగవచ్చనే ఆందోళన  ప్రజలలో నెలకొంది.

ఈ నేపథ్యంలో పుతిన్‌ భారత్‌ పర్యటన ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో చమురు సంక్షోభం తీరేలా ఇరు దేశాల మధ్య ఏదైనా ఒప్పందం జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. దానికి బలం చేకూర్చేలా ఇటీవలే ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మాట్లాడుతూ "భారతదేశానికి ఇంధన సరఫరా ఒప్పందాల విషయంలో ఎలాంటి అడ్డంకులు రాకుండా రష్యా అన్ని బాధ్యతలను నెరవేరుస్తుంది. బాహ్య శక్తుల నుండి వచ్చే ఎలాంటి అనైతిక పోటీల వల్ల భారత్ ప్రయోజనాలకు నష్టం వాటిల్లనివ్వం." అని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ మాటలతో భారత్‌కు ఎంతో ఊరట లభించింది.

ఇతర ఇంధన రంగాలు 
కేవలం ముడి చమురు మాత్రమే కాకుండా, భారత్‌కు అవసరమైన ఎల్.ఎన్.జి బొగ్గు సరఫరాలను పెంచడం, తమిళనాడులోని కుడంకుళం అణు విద్యుత్ కేంద్రం  లాంటి ఉమ్మడి ప్రాజెక్టుల విస్తరణపై కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది.

రూపాయి-రూబుల్ చెల్లింపులు
అంతే కాకుంగా చమురు కొనుగోళ్లకు సంబంధించి డాలర్ల కొరత లేదా అంతర్జాతీయ ఆంక్షల ఇబ్బందులు రాకుండా ఉండేందుకు, స్వదేశీ కరెన్సీలలో (రూపాయి - రూబుల్) సురక్షితమైన బ్యాంకింగ్ మరియు ఆర్థిక ఛానళ్లను ఏర్పాటు చేయడంపై ఈ పర్యటనలో మోదీ, పుతిన్ తుది నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇందులో ఓ సమస్య ఉంది. రష్యా నుంచి చమరుదిగుమతులతో భారత్‌ తన స్వంత కరెన్సీలో చెల్లింపులు చేస్తే ఆ డబ్బులు వారి వద్ద అధికంగా నిల్వ ఉంటున్నాయి. ఎందుకంటే రష్యా భారత్‌కు ఎగుమతులు చేస్తున్నంతగా ఆ దేశానికి భారత ఎగుమతులు లేవు అందుకే వారి వద్ద కరెన్సీ నిల్వలు అధికంగా ఉంటున్నాయి. దీంతో రష్యా ఆ డబ్బను తిరిగి భారత ప్రభుత్వ బాండ్లు, షేర్లు ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెడుతుంది.

భారత్‌కు రష్యా పూర్తి స్థాయిలో చమురు సరఫరా చేయగలదా?

రష్యా రోజుకు సుమారు 10.3 మిలియన్ బ్యారెళ్ల (1 కోటి 3 లక్షల బ్యారెళ్లు) ముడి చమురును ఉత్పత్తి చేస్తుంది. ఇందులో దాదాపు 4.5 నుండి 4.9 మిలియన్ బ్యారెళ్లను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంది. భారత్‌కు సగటున రోజుకు సుమారు 5.3 మిలియన్ బ్యారెళ్ల వరకూ చమురు అవసరం కనుక రష్యా భారత్‌ అవసరాలను దాదాపు తీర్చగలదు.

ప్రధాన సమస్యలు

లాజిస్టిక్స్, రవాణా సవాళ్లు 
గల్ఫ్ దేశాలు (సౌదీ, ఇరాక్, యూఏఈ) భారత్‌కు భౌగోళికంగా చాలా దగ్గరగా ఉన్నాయి. అక్కడి నుండి చమురు నౌకలు కేవలం 4 నుండి 7 రోజుల్లో భారత్ చేరుకుంటాయి. కానీ రష్యా నుండి చమురు రావాలంటే చాలా దూరం ప్రయాణించాలి. రష్యా పశ్చిమ నౌకాశ్రయాల  నుండి వచ్చే నౌకలు భారత్ చేరడానికి 30 నుండి 35 రోజులు పడుతుంది.

పశ్చిమ దేశాల ఆంక్షల వల్ల రష్యా చమురును రవాణా చేయడానికి అంతర్జాతీయ నౌకలు, భీమా సంస్థలు ముందుకు రావడం లేదు. రష్యా తన స్వంత 'షాడో ఫ్లీట్' (పాత నౌకలు) ద్వారానే సరఫరా చేస్తోంది. భారత్‌కు కావాల్సినంతగా ఇందులో చమురు రవాణా చేయడం కొద్దిగా కష్టమైన పని.

రిఫైనరీల సాంకేతికత 
భారతదేశంలోని చమురు శుద్ధి కర్మాగారాలు (Refineries) దశాబ్దాలుగా మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి వచ్చే 'సౌర్ క్రూడ్' (సల్ఫర్ ఎక్కువగా ఉండే చమురు) ను శుద్ధి చేసేలా డిజైన్ చేయబడ్డాయి. రష్యా నుంచి వచ్చే 'ఉరల్స్ క్రూడ్'  రకం కొద్దిగా భిన్నంగా ఉంటుంది.భారతీయ రిఫైనరీలు రష్యా చమురును 100% వాడలేవు; సాంకేతిక బ్యాలెన్స్ కోసం మిడిల్ ఈస్ట్ చమురును కూడా కలిపి వాడాల్సి ఉంటుంది.

భారత్‌కు ఇష్టం లేదు 
వ్యూహాత్మకంగా భారతదేశం తన ఇంధన అవసరాల కోసం ఏ ఒక్క దేశం పైనా పూర్తి స్థాయిలో ఆధారపడదు. రేపు రష్యాతో ఏదైనా సమస్య వస్తే భారత్ ఇరుక్కుపోతుంది. అందుకే భారత్ తన రిస్క్‌ను తగ్గించుకోవడానికి రష్యాతో పాటు సౌదీ అరేబియా, ఇరాక్, యూఏఈ, అమెరికా దేశాల నుండి చమురును విడివిడిగా కొనుగోలు చేస్తుంది.
 

అయితే ఈ పర్యటనతో భారత చమురు సమస్య పూర్తిగా తీరుతుంది అని చెప్పడం అతిశయోక్తే అయినప్పటికీ ప్రస్తుత చమురు సంక్షోభ పరిస్థితులను అరికట్టడానికి ఎంతో కొంత సహకరిస్తుందనేది మాత్రం చెప్పవచ్చు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement