
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ (Operation Sindoor) విజయవంతమైంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న పాకిస్తాన్ భూభాగంలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై భారత దళాలు మెరుపు దాడులు చేశాయి. ఇందుకు తామూ సమర్థవంతంగా ప్రతిఘటించామంటూ పాకిస్తాన్ ప్రకటించుకుంది. రాఫెల్స్ సహా ఐదు భారత యుద్ధ విమానాలను తమ బలగాలు కూల్చివేశాయంటూ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేసింది. అయితే దీనిపై పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందించారు.
భారత యుద్ధ విమానాలను పాకిస్తాన్ బలగాలు కూల్చివేశాయంటూ సోషల్ మీడియాలో చేసిన ఫేక్ ప్రచారాన్ని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కప్పిపుచ్చే ప్రయత్నం చేశాడు. పాకిస్తాన్ తన వాదనను నిరూపించడానికి ఏదైనా ఆధారాలు ఉన్నాయా అని సీఎన్ఎన్ ఇంటర్వ్యూలో విలేకరి అడిగ్గా ఆసిఫ్ వింత సమాధానం ఇచ్చాడు. ‘అదంతా ఇండియన్ సోషల్ మీడియాలోనే తప్ప మన సోషల్ మీడియాలో కాదు. జెట్ విమానాల శిథిలాలు వారి వైపు పడ్డాయి. ఇదంతా భారత మీడియాలోనే ఉంది' అని వింతగా బదులిచ్చారు.
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు ప్రతిగా తామూ రెండు రాఫెల్ జెట్‌లు, ఒక సు-30తో సహా మూడు భారత వైమానిక దళ (IAF) యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు పాకిస్తాన్ పేర్కొంది. అయితే, ఈ వాదనలను భారత్ నిర్ద్వంద్వంగా ఖండించింది. కార్యకలాపాల సమయంలో ఐఏఎఫ్ విమానాలు ఏవీ కోల్పోలేదని పేర్కొంది. ఇదంతా ఫేక్ ప్రచారమని తెలిపింది.
పాకిస్తాన్ చేస్తున్నది ఫేక్ ప్రచారమని భారత ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ నివేదించింది. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా బహవల్ పూర్ సమీపంలో భారత రాఫెల్ జెట్ ను పాకిస్థాన్ కూల్చివేసిందంటూ సోషల్ మీడియా షేర్ చేసిన ఫొటో 2021లో జరిగిన ప్రమాదానికి సంబంధించినదని తెలిపింది.