
విజయవాడలో ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డి నివాసంలోకి చొరబడి సోదాలు చేస్తున్న పోలీసులు
ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి నివాసంలో సోదాలు
సెర్చ్ వారంట్ లేకుండా ఇంట్లోకి చొరబడి బెదిరింపులు
దాదాపు నాలుగు గంటలపాటు హల్‌చల్
సంబంధం లేని విషయాలపై ప్రశ్నలు
న్యాయస్థానాల తీర్పులు బేఖాతరు.. పోలీసుల దాష్టీకంపై మండిపడ్డ పాత్రికేయులు
సాక్షి, అమరావతి: ప్రజల గొంతుకగా నిలుస్తున్న ‘సాక్షి’పై చంద్రబాబు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు, వేధింపులకు బరితెగిస్తోంది. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తుండటంతో కక్షకట్టి పోలీసులను ఉసిగొలిపి బెదిరింపులకు దిగుతోంది. రాజ్యాంగాన్ని కాలరాస్తూ, పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తూ ఎమర్జెన్సీ నాటి దురాగతాలకు పాల్పడుతోంది. ఏకంగా సాక్షి దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి విజయవాడ నివాసంలో గురువారం సోదాల పేరుతో బెదిరింపు చర్యలకు పాల్పడటం ప్రభుత్వ కుట్రకు పరాకాష్టగా నిలుస్తోంది.
కనీసం సెర్చ్ వారంట్ కూడా లేకుండా, నోటీసు కూడా ఇవ్వకుండా గురువారం ఉదయం 9 గంటలకే విజయవాడ ఏసీపీ దామోదర్‌తోపాటు పలువురు పోలీసు అధికారులు సాక్షి ఎడిటర్ నివాసంలోకి ప్రవేశించి సోదాల పేరుతో హల్‌చల్ చేశారు. అసలు పోలీసులు ఎందుకు వచ్చారని ఆయన ప్రశ్నించినా సరైన సమాధానం ఇవ్వలేదు. తన నివాసంలో సోదాలు చేసేందుకు సెర్చ్ వారంట్ చూపించాలని అడిగితే పట్టించుకోకుండా అన్ని గదుల్లో తనిఖీలు కొనసాగించడం గమనార్హం.
ఏ కేసులో సోదాలు చేస్తున్నారు.. ఏం కావాలని ఎడిటర్ ధనంజయ రెడ్డి ఎంతగా అడిగినా ఏసీపీ దామోదర్ కనీస సమాధానం కూడా ఇవ్వలేదు. సమాచారం తెలిసిన పాత్రికేయ సంఘాల ప్రతినిధులు, పాత్రికేయులు హుటాహుటిన ఆయన నివాసానికి చేరుకున్నారు. కానీ వారిని పోలీసులు లోపలికి అనుమతించలేదు. ఇంటి తలుపులు వేసి.. ధనంజయ రెడ్డిని ఎవరూ కలవకుండా అడ్డుకున్నారు.
ధనంజయ రెడ్డికి ఏమాత్రం సంబంధం లేని అంశాలపై ప్రశ్నించారు. ఇంట్లో ఎవరెవరు ఉంటారు... మీరు ఎప్పుడు వచ్చారు.. అంటూ ప్రశ్నలు వేయడం గమనార్హం. ఎందుకు అలా ప్రశ్నిస్తున్నారని అడిగితే సమాధానం మాత్రం చెప్ప లేదు. తమను లోపలికి అనుమతించాలని పాత్రికేయులు ఎంతగా కోరినా పోలీసులు పట్టించుకోలేదు. పోలీసులు అనుసరిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక వైఖరి, దౌర్జన్యపూరిత తీరుకు నిరసనగా పాత్రికేయులు అక్కడే ఆందోళన చేపట్టారు.
సెర్చ్ వారంట్ ఇవ్వకుండానే ఇచ్చినట్లు
ఉదయం 11 గంటల సమయంలో తాము సోదాలు చేసినట్టు ఓ కాగితంపై రాసి సంతకం చేయాలని ధనంజయ రెడ్డికి చెప్పారు. సిట్ దర్యాప్తు చేస్తున్న మద్యం కేసులో నిందితులు ఉన్నారేమోనని తెలుసుకునేందుకు తాము సెర్చ్ వారంట్‌తో వచ్చి సోదాలు నిర్వహించినట్టు పేర్కొనడం గమనార్హం. దీనిపై ఎడిటర్ ధనంజయ రెడ్డి అభ్యంతరం తెలిపారు. అసలు మద్యం కేసులో నిందితులు తన నివాసంలో ఎందుకు ఉంటారని ఆయన పోలీసులను నిలదీశారు.
కొంత కాలం నుంచి హైదరాబాద్‌లో ఉంటున్న తాను బుధవారం రాత్రే విజయవాడ వచ్చానని తెలిపారు. కేవలం సాక్షి పత్రికను బెదిరించేందుకే ఎడిటర్ నివాసంలో సోదాల పేరుతో హడావుడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు సెర్చ్ వారంట్ ఇవ్వకుండానే ఇచ్చినట్టు.. అనంతరమే సోదాలు నిర్వహించినట్టు ఎలా రాస్తారని.. తాను ఎందుకు సంతకం చేయాలని ఆయన ప్రశ్నించారు.
తన న్యాయవాదితో సంప్రదించిన తర్వాతే సంతకం చేస్తానన్నారు. దాంతో న్యాయవాది మనోహర్ రెడ్డిని పోలీసులు లోపలికి అనుమతించారు. పోలీసుల తీరును న్యాయవాది మనోహర్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. ఏదైనా సరే నిబంధనల ప్రకారం చేయాలని, పోలీసులు ఇష్టారాజ్యంగా చేయడానికి వీల్లేదని న్యాయస్థానాలు స్పష్టం చేస్తూ ఇచ్చిన తీర్పులను ఆయన ఉదహరించారు.
వ్యక్తి స్వేచ్ఛే అత్యున్నతమైందన్న న్యాయస్థానాల తీర్పులను కూడా ఖాతరు చేయరా అని పోలీసులను నిలదీశారు. కాసేపు తర్జనభర్జనల అనంతరం పోలీసులు సెర్చ్ వారంట్‌ను అప్పటికప్పుడు పెన్‌తో రాసి ఇచ్చి.. తాము సోదాలు చేసినట్టు పంచనామా నివేదికను సమర్పించి వెళ్లిపోయారు. దాదాపు మూడు గంటలపాటు పోలీసులు సోదాల పేరుతో సాక్షి ఎడిటర్ నివాసంలో హల్‌చల్ చేశారు. కేవలం సాక్షి గొంతు నొక్కేందుకే ఇలా బెదిరింపులకు పాల్పడినట్టు స్పష్టమవుతోంది.