పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలు.. ఏటా వచ్చే జాతర అన్నీ ఒకేసారి వస్తే ఎలా ఉంటుంది?.. అంతకన్నా రెట్టింపు స్థాయిలో కిక్కిరిసిన జన ప్రవాహాలు ఇప్పుడు ఆ మారుమూల ప్రాంతం వైపు వడివడిగా సాగుతున్నాయి. ఇడుపులపాయలో వేసిన తొలి అడుగు.. కోట్లాది హృదయాలను గెలుచుకుంటూ, రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చేందుకు ఇచ్ఛాపురంలో ఆఖరి ఘట్టాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర బుధవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద ముగియనుంది. కీలక నిర్ణయంతో రాజకీయాలను మరో మలుపు తిప్పిన ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్ర ముగింపు సన్నివేశాన్ని తిలకించేందుకు ఇచ్ఛాపురం వీధుల్లో అంతా వేయి కళ్లతో నిరీక్షిస్తున్నారు. ఉత్సాహం, ఉత్కంఠ, ఆనందం, ఆత్మీయత అందరిలోనూ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.