తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన రాయల్ వశిష్ట పున్నమి బోటు వెలికితీత పనులు కొలిక్కి రావడం లేదు. ఆదివారం కూడా బోటు వెలికితీత పనులు కొనసాగుతున్నాయి. తీరానికి అతి సమీపంలో బోటు ఉండటంతో డీప్ వాటర్ డ్రైవర్లతో బోటుకు యాంకర్లు బిగించి ధర్మాడి సత్యం బృందం బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. బోటును బయటకు తీసేందుకు ధర్మాడి సత్యం బృందం నిన్న కూడా విఫలయత్నం చేసింది. బోటు ఆచూకీ గుర్తించి అయిదు రోజులు గడిచిపోగా.. గురు, శుక్ర, శనివారాల్లో బోటును ఒడ్డు వైపునకు 70 అడుగుల మేర చేర్చారు. శనివారం మూడుసార్లు వృత్తాకారంలో ఐరన్ రోప్‌ను బోటు ఉన్న ప్రాంతంలో నదిలోకి విడిచిపెట్టి ఉచ్చు మాదిరిగా బిగించి బయటకు లాగే ప్రయత్నం చేశారు.