అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తున్నారని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద చేపట్టిన సమైక్య ధర్నాలో వైఎస్ జగన్ ప్రసంగించారు. బ్రిటీష్ వారు పాలిస్తున్న రోజుల్లో కూడా ఇంతటి అన్యాయం జరగలేదని జగన్ విమర్శించారు. విభజించు పాలించు అన్న రీతిలో కేంద్రం పరిపాలిస్తోందన్నారు. ఈ పాలకుల కంటే బ్రిటీష్ వారే నయం అనే రీతిలో ప్రస్తుత పాలన సాగుతుందని ఎద్దేవా చేశారు. నాలుగు ఓట్లు, సీట్లు సమైక్య రాష్ట్రాన్ని విభజించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటున్నారని, ఒకవేళ విభజన జరిగితే తెలుగువారి పరిస్థితి ఏంటని ఆలోచించమని అధిష్టాన పెద్దలకు విన్నవిస్తున్నానన్నారు. రాష్ట్రం కలిసి ఉన్న ఇప్పుడే కృష్ణానది నీళ్లురాని పరిస్థితి ఉంటే మధ్యలో మరో రాష్ట్రం వస్తే పరిస్థితి ఏంటని నిలదీశారు. 11 జిల్లాల్లో రైతులు నీళ్ల కోసం రోజంతా తన్నుకునే పరిస్థితి రాదా? అని జగన్ ప్రశ్నించారు. హైదరాబాద్ ను విడిచిపెట్టి వెళ్లిపోమని చాలా సునాయాసంగా చెబుతుండటాన్ని జగన్ తప్పుబట్టారు. రాష్ట్ర బడ్జెట్ లో 60 శాతం నిధులు హైదరాబాద్ నుంచే వస్తున్నాయని, విడిపోతే సీమాంధ్ర అభివృద్ధికి నిధులు ఎలా వస్తాయన్నారు. రేపు బిల్లు చర్చకు వస్తుందని అంటున్నారని, అసలు బిల్లు ఎప్పుడు ప్రవేశపెట్టారని అడిగే నాథుడూ లేకుండా పోవడం నిజంగా సిగ్గు చేటన్నారు.విభజన అనివార్యమై రాష్ట్రం రెండు ముక్కలైతే..యువత ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్లాలని జగన్ సూటిగా ప్రశ్నించారు. సమైక్య ధర్నా ముగిసిన అనంతరం జగన్ పిలుపు మేరకు సమైక్యవాదులు కాలినడకను పార్లమెంట్ కు బయల్దేరారు.
Feb 17 2014 5:31 PM | Updated on Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
Advertisement
