ఆర్టీసీకి ‘సమ్మె’ట పోటు తప్పింది. సంస్థ యాజమాన్యం, గుర్తింపు పొందిన కార్మిక సంఘాలు ఎంప్లాయిస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ మధ్య గురువారం అర్ధరాత్రి వరకు కొనసాగిన చర్చలు ఫలించాయి. దశలవారీగా కాంట్రాక్టు కార్మికుల సర్వీసు క్రమబద్దీకరణకు, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆర్థిక ప్రయోజనాలు వర్తించే విధంగా వేతన సవరణను అమలు చేయడానికి యాజమాన్యం అంగీకరించింది. వచ్చే సంవత్సరం నవంబర్ నాటికి కాంట్రాక్టు కార్మికులు అందరినీ క్రమబద్దీకరించడానికి చర్యలు చేపడతామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది. వేతన సవరణ ప్రక్రియను వేగవంతం చేసి ఈ ఏడాది అక్టోబర్ నాటికి పూర్తి చేస్తామని చెప్పింది. కాంట్రాక్టు కార్మికుల క్రమబద్దీకరణ, ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచే వేతన సవరణ అమలు.. డిమాండ్లతో గుర్తింపు సంఘాలు ఈయూ, టీఎంయూ గత నెల్లో సమ్మె నోటీసు ఇచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి 8 గంటల నుంచి బస్ భవన్‌లో ప్రారంభమైన చర్చలు పొద్దుపోయేవరకు కొనసాగాయి. చర్చోపచర్చల అనంతరం... కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న మొత్తం 17,287 మంది డ్రైవర్లు, కండక్టర్లు అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని యాజమాన్యం ప్రకటించింది.