సీమాంధ్ర మంత్రుల రాజీనామా వార్తలను టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాపరెడ్డి ఖండించారు. రాష్ట్ర విభజనపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడతామని వారు స్పష్టం చేశారు. తమ ప్రాంత ప్రజల అభిప్రాయలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. రాజీనామా చేస్తామని తాము ప్రకటించలేదని తెలిపారు. నాలుగు గోడల మధ్య జరిగిన భేటీపై వివరణ తీసుకొని వార్తలు రాస్తే బాగుండేదని మీడియాకు చురక అంటించారు. సమైక్యరాష్ట్రం కోరుతూ తమ వాదన వినిపిస్తామని ప్రకటించారు. వెనకబాటుతనమే ప్రాతిపదికైతే రాయలసీమ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని విభజించే పరిస్థితి వస్తే మూకుమ్మడి రాజీనామాలు చేయాలని నిన్న జరిగిన సమావేశంలో సీమాంధ్ర మంత్రులు నిర్ణయం తీసుకున్నారని వార్తలు వచ్చాయి. తమతో పాటు సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు కూడా రాజీనామాలు చేసేలా ఒత్తిడి తేవాలని నిర్ణయించినట్టు మీడియాలో ప్రచారం జరుగుతోంది.