రిషితేశ్వరి ఆత్మహత్యకు ఆర్కిటెక్చర్ కాలేజీ ప్రిన్సిపాల్ బాబూరావు కూడా కారణమని కమిటీ నివేదికలో స్పష్టం చేసింది. ఆయన అండదండలతో వర్సిటీలో అరాచకాలు యథేచ్ఛగా సాగుతున్నట్లు నివేదికలో వివరించింది. కాలేజీలోనే అమ్మాయిలు, అబ్బాయిలు కలసి మందుపార్టీలు చేసుకుంటున్నారని పేర్కొంది. ప్రిన్సిపాల్ ప్రవర్తన సరిగా లేదని, ఆయనఅండతో కాలేజీలో మద్యం ప్రవహిస్తోందని వివరిం చింది. రిషితేశ్వరిని లై ంగిక వేధింపులకు గురి చేశారని, రిషితేశ్వరి ఫొటోలు తీసి ప్రచారం చేశారని, ఇవన్నీ ప్రిన్సిపాల్ అండతోనే సాగాయని తెలిపింది. ర్యాగింగ్, లైంగిక వేధింపులతో రిషితేశ్వరి మానసికంగా కుంగిపోయిందని, అవే కారణాలు ఆమె ఆత్మహత్యకు దారితీశాయని వివరించింది. రిషితేశ్వరి అమాయకురాలని స్పష్టం చేసింది. ప్రిన్సిపాల్ బాబూరావుపై నిందితుడిగా కేసు నమోదు చేయాలని సూచించింది. ఈ కేసు విచారణకు ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని, విచారణ కోసం ప్రత్యేకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించాలని సూచించింది. మళ్లీ ర్యాగింగ్ జరగకుండా ఉండేలా రిషితేశ్వరి ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని సిఫార్సు చేసింది. ర్యాగింగ్‌పై నిర్భయ చట్టం కన్నా గట్టి చట్టం తీసుకురావాలని నివేదికలో సూచించింది. నాగార్జున వర్సిటీలో ఏ నిబంధనలూ పాటించడం లేదని పేర్కొంది. మహిళా హాస్టల్‌కు పర్మనెంట్ వార్డెన్‌ను నియమించాలని సూచించింది.