గోదావరి మహా పుష్కరాలు మంగళవారం నుంచి ఘనంగా ప్రారంభం కాబోతున్నాయి. ఈనెల 25 వరకు పన్నెండు రోజుల పాటు జరగనున్న పుష్కరాలలో దాదాపు రెండు కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తారని భావిస్తున్నారు. ఈ సంఖ్య అంతకు రెట్టింపు ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలి పుష్కరాలు కావటంతో ప్రభుత్వం వీటిని ప్రతిష్టాత్మకంగా భావించి కుంభమేళా తరహాలో నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఆవిర్భావం, ముమ్మర ప్రచారం వెరసి గతంలో జరిగిన పుష్కరాలతో పోలిస్తే ఈ పుష్కరాలకు ప్రాధాన్యం పెరిగింది. తెలంగాణ వ్యాప్తంగా గోదావరి తీరంలో 73 ప్రాంతాల్లో 81 పుష్కర ఘాట్లను ఏర్పాటు చేశారు. పుష్కర ప్రాంతాలకు ప్రత్యేకంగా రోడ్లను నిర్మించారు. ఆయా ప్రాంతాల్లోని దేవాలయాలను అందంగా ముస్తాబు చేశారు. ఇందుకు దాదాపు రూ.600 కోట్లు ఖర్చు చేశారు. కేంద్ర ప్రభుత్వం మరో రూ.50 కోట్లు అందజేసింది.