సింగపూర్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి సంబంధించిన తొలివిడత ప్లాన్ను ఏపీ ప్రభుత్వానికి ఈరోజు అందజేశారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సింగపూర్ బృందం ఈ ప్లాన్ను అప్పగించింది. చంద్రబాబు నాయుడు నిన్న సింగపూర్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆయన వెంట ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి. నారాయణ, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, ప్రణాళిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.పి. టక్కర్, ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి సతీష్ చంద్ర, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి ఎ.గిరిధర్, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.ఎస్. రావత్ ఉన్నారు. ఈ రోజు, రేపు చంద్రబాబు సింగపూర్లో పర్యటిస్తారు. సింగపూర్లో ఈరోజు జరిగిన అత్యున్నత స్థాయీ సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సింగపూర్ తరపున పారిశ్రామిక మంత్రి ఈశ్వరన్, కార్యదర్శి చీర్ హాంగ్టాట్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ తరపున చంద్రబాబుతోపాటు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఆ తరువాత ఏపీ నూతన రాజధాని నిర్మాణానికి అవసరమైన మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్న ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ సమావేవంలో సింగపూర్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ ప్రతినిధులు మాస్టర్ ప్రణాళికను ప్రజెంటేషన్ ద్వారా చంద్రబాబుకు వివరించారు. తొలివిడత ప్లాన్ను ఆయనకు అందజేశారు. రేపు చంద్రబాబు నాయుడు సింగపూర్ సీనియర్ మంత్రి గో చోక్ టంగ్‌తో సమావేశం అవుతారు. అనంతరం బిషన్ పార్కును సందర్శించడంతో పాటు సమీకృత రవాణా కేంద్రం గల టోపయో సందర్శిస్తారు. సింగపూర్ టౌన్‌షిప్‌ను సందర్శించడంతో పాటు అక్కడ గల వాణిజ్య, పౌర సముదాయాలను పరిశీలిస్తారు. రేపు సాయంత్రం చాంగై విమానాశ్రయం నుంచి బయలు దేరి రాత్రికి చంద్రబాబు హైదరాబాద్ చేరుకుంటారు.
Mar 30 2015 8:05 PM | Updated on Mar 22 2024 11:29 AM
Advertisement
Advertisement
Advertisement
